హైదరాబాద్‌ : నటుడు రవితేజ నటిస్తున్న ‘ఇరుముడి’ సినిమా షూటింగ్‌లో ఓ మైనర్ బాలికను పాల్గొనించడంతో, తెలంగాణ కార్మిక శాఖ అధికారులు చిత్ర నిర్మాతలకు నోటీసులు జారీ చేశారు. బాలికను సినిమా షూటింగ్‌లో నటింపజేసే ముందు చట్టపరమైన అనుమతులు, రక్షణ చర్యలు తీసుకున్నారా అనే అంశంపై వివరాలు కోరుతూ కార్మిక శాఖ ఈ నోటీసులు పంపింది.

ఈ మేరకు తెలంగాణ కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ సినిమా టీంకు పలు ప్రశ్నలు పంపించారు. మైనర్ బాలిక సినిమా షూటింగ్‌లో పాల్గొనే ముందు సంబంధిత జిల్లా మేజిస్ట్రేట్ నుండి అనుమతి తీసుకున్నారా? బాలిక తల్లిదండ్రుల నుండి అధికారిక సమ్మతి పత్రం పొందారా? అనే విషయాలను స్పష్టంగా తెలియజేయాలని ఆదేశించారు.

అలాగే బాలికకు సంబంధించిన కాల్ షీట్లు, అటెండెన్స్ రికార్డులు, షూటింగ్‌లో ఆమె పాల్గొన్న పని గంటల వివరాలు సమర్పించాలని సూచించారు. బాలిక చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారో, షూటింగ్ సమయంలో ఆమె భద్రత, సంక్షేమం కోసం ప్రత్యేక సంరక్షకుడిని నియమించారా అనే అంశాలపై పూర్తి వివరాలు ఇవ్వాలని కార్మిక శాఖ కోరింది.

బాలికకు చెల్లించిన పారితోషికంలో 20 శాతం మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో జమ చేశారా అనే విషయంపై కూడా అధికారులు వివరణ కోరారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లలో బాలికను పాల్గొనించే యోచన ఉందా? ఉంటే వాటికి సంబంధించిన ఏర్పాట్లు, రక్షణ చర్యలపై వివరాలు ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన పూర్తి ఆధారాలు, రికార్డులతో నవంబర్ 4 ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని సినిమా నిర్మాతలకు కార్మిక శాఖ అధికారులు ఆదేశించారు. నోటీసులు అందుకున్న నిర్మాతలు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. మైనర్ బాలలతో సినిమా షూటింగ్ నిర్వహణపై చట్టపరమైన నిబంధనలు, అమలు పరిస్థితులపై ఈ విచారణలో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు సూచిస్తున్నాయి.