రాయలసీమ న్యూస్, వెదర్ డెస్క్: దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం కొనసాగుతుండటంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా తెలంగాణలో రుతుపవనాలు విస్తరించినప్పటికీ జూన్, జులై నెలల్లో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాగు పనులు నిలిచిపోవడంతో వర్షాల కోసం ఆకాశం వైపు ఎదురుచూస్తున్న రైతులకు వాతావరణ శాఖ ఊరట కలిగించే అంచనాలు వెల్లడించింది.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనానికి అనుకూల వాతావరణం ఏర్పడటంతో రుతుపవనాలు తిరిగి బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే నాలుగు నుంచి ఐదు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
వాతావరణ శాఖ వివరాల ప్రకారం వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా – వెస్ట్ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. అక్కడి నుంచి కోస్తాంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించి ఉంది. అల్పపీడనానికి అనుబంధంగా ఒక ఆవర్తన ద్రోణి కూడా కొనసాగుతోంది. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
రాష్ట్రంలో ఈ నెల 22వ తేదీ వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉండగా, వర్షాల సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
నేడు మధ్యాహ్నం నుంచి రాత్రి వేళల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేయబడింది.
అదే విధంగా సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, రంగారెడ్డి, సిద్ధిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, నల్గొండ, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
వర్షాలు, ఈదురుగాలులు కొనసాగుతున్న సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే మాత్రమే ఇళ్ల నుంచి బయటకు రావాలని, చెట్లు, పాత భవనాల సమీపంలో నిలుచోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.







