బద్వేల్ పట్టణంలోని సాయినగర్‌లో ఉన్న శ్రీ దత్తసాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం వైభవంగా గురుపౌర్ణమి మహోత్సవాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రోజంతా ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు స్వచ్ఛంద రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే భక్తులు ఆలయానికి భారీగా తరలి వచ్చి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఉదయం 4.30 గంటలకు కాకడ హారతితో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం శ్రీ బాబా వారికి పంచామృతాభిషేకం, గురుపూజలు నిర్వహించారు. భక్తులకు నిరంతర దర్శనం కల్పిస్తూ, ప్రత్యేక భక్తి కార్యక్రమాలు కూడా నిర్వహించారు. మధ్యాహ్నం మహా ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేయగా, సాయంత్రం సంధ్యాహారతి, రాత్రి శేజహారతి నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. రాత్రి శ్రీ బాబా వారి పల్లకీ సేవతో పాటు భజన కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేశారు.

గురుపౌర్ణమి సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి ఆలయ ప్రాంగణంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ శిబిరంలో యువత, మహిళలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడే మహోన్నత సేవలో భాగస్వాములు కావాలని కోరారు.

“రక్తదానం చేయండి – ప్రాణదాతలు కండి”

అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ శిబిరం ద్వారా రక్తదానం వల్ల రక్తదాత ఆరోగ్యానికి కూడా ప్రయోజనాలు ఉంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగుల ప్రాణాలను కాపాడేందుకు రక్త నిల్వలు పెరగడం ఎంతో అవసరమని వారు తెలిపారు. భక్తులందరూ గురుపౌర్ణమి మహోత్సవాల్లో పాల్గొని బాబా ఆశీస్సులు పొందడంతో పాటు రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయడంలో తమ వంతు పాత్రను పోషించారు.

అదేవిధంగా గురుపౌర్ణమి సందర్భంగా గుడి ప్రాంగణంలో జరిగే కార్యక్రమాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎస్ వి సి ఎం పాలిటెక్నిక్ కాలేజ్, ఎస్ఆర్ఎన్బి డిగ్రీ కాలేజ్ విద్యార్థిని, విద్యార్థులు వాలంటీర్లుగా సేవలందించారు. ఆలయానికి వచ్చే భక్తులకు మార్గదర్శనం చేస్తూ, అవసరమైన చోట సహాయం అందించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా తమ బాధ్యతను నిర్వర్తించారు. గురుపౌర్ణమి పర్వదినం సందర్భంగా భక్తి, సేవలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడాయి.