రాయలసీమ న్యూస్, డిస్ట్రిక్ట్ న్యూస్ డెస్క్:
“ఒక నెల - ఒక నియోజకవర్గం - నాలుగు పర్యటనలు”
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతేక కార్యక్రమం ప్రారంభం
వైఎస్ఆర్ కడప : రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం, పాలనను ప్రజల ముంగిలికి చేర్చడం లక్ష్యంగా “ఒక నెల - ఒక నియోజకవర్గం - నాలుగు పర్యటనలు” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి నేరుగా వినతులు స్వీకరించి, సంబంధిత అధికారుల సమక్షంలో సమస్యలకు పరిష్కార మార్గాలు చూపించడమే ప్రభుత్వ ఉద్దేశంగా అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు పట్టణంలోని రాఘవేంద్ర గ్రాండ్ లో “ఒక నెల - ఒక నియోజకవర్గం - నాలుగు పర్యటనలు” కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆర్డీఓ చంద్ర మోహన్ తదితరులు హాజరయ్యారు.
కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను, వినతులను అధికారులకు తెలియజేశారు. ప్రజలు సమర్పించిన అర్జీలను అధికారులు క్రమబద్ధంగా స్వీకరించి నమోదు చేశారు. మండలాల వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడంతో అర్జీల స్వీకరణ ప్రక్రియ సజావుగా కొనసాగింది.జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను సావధానంగా విన్నారు. ప్రతి వినతిని ఒక్కొక్కటిగా పరిశీలిస్తూ, సమస్యల స్వరూపం, పరిష్కారానికి అవసరమైన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో అక్కడికక్కడే చర్చించారు. అవసరమైన చోట వెంటనే సూచనలు, ఆదేశాలు జారీ చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు జిల్లా పరిపాలన వర్గాలు పేర్కొన్నాయి.
కార్యక్రమంలో పాల్గొన్న వివిధ శాఖల జిల్లా అధికారులు తమ తమ శాఖలకు సంబంధించిన సమస్యలపై ప్రజల నుండి వివరాలు సేకరించారు. ముఖ్యంగా ఆదాయ, భూ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్య ఆరోగ్య తదితర శాఖల అధికారులు ప్రజల వినతులను నమోదు చేసి, తదుపరి చర్యల కోసం నోట్లు సిద్ధం చేశారు.
“ఒక నెల - ఒక నియోజకవర్గం - నాలుగు పర్యటనలు” కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యంగా అధికారులు ప్రతి నెలా ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసి, ఆ నియోజకవర్గంలో నాలుగు పర్యటనలు నిర్వహించనున్నారు. వారానికి ఒక పర్యటన చొప్పున నిర్వహించే ఈ సందర్శనల ద్వారా గ్రామ స్థాయిలోనూ సమస్యలను గుర్తించి, పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా అధికారులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా, అధికారులు స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను తెలుసుకుని, పరిష్కారానికి చర్యలు తీసుకునే విధంగా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా పరిపాలన వర్గాలు పేర్కొన్నాయి.













