రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్:
సమీక్షలు సరే.. బెల్ట్ తీసేదెప్పుడు!
వైఎస్సార్ కడప జిల్లాలో మద్యం అక్రమ రవాణా, బెల్ట్ దుకాణాల ఉచ్చులో ప్రజలు ఇరుక్కుపోతున్నారు. అధికారుల సమీక్షా సమావేశాలు, హెచ్చరికలు ఒక వైపు సాగుతుండగా.. నేలమీద పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కడపలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా ఎక్సైజ్ సమీక్షా సమావేశంలో ఉన్నతాధికారులు జిల్లాలో ఎక్కడా మద్యం గొలుసు దుకాణాలు ఉండకూడదని స్పష్టం చేసినట్లు సమాచారం. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయిస్తే కేసులు నమోదు చేయాలని, పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆ సూచనలు, ఆదేశాలు కాగితాలకే పరిమితమైపోయాయని ప్రజలు విమర్శిస్తున్నారు.
మద్యం అక్రమ విక్రయాలను అడ్డుకోవాల్సిన ఎక్సైజ్, పోలీసు అధికారులు నామమాత్రపు దాడులతోనే సరిపెట్టుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి, అప్పుడప్పుడూ నిర్వహించే తనిఖీలతో బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని అక్రమ మద్యం వ్యాపారులు మరింత రెచ్చిపోతున్నారు.
జిల్లాలో అనేక ప్రాంతాల్లో బెల్ట్ దుకాణాలు బహిరంగంగానే నడుస్తున్నాయి. ఎమ్మార్పీ కంటే రూ.20 నుంచి రూ.30 వరకు అదనంగా వసూలు చేస్తూ మద్యం విక్రయిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా పెద్దగా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా గోవా నుంచి అక్రమార్కులు ప్రత్యేక వాహనాల ద్వారా ప్రతినెలా లక్షల రూపాయల విలువైన మద్యం జిల్లాకు తెప్పిస్తున్నారని సమాచారం. ప్రొద్దుటూరు, పులివెందుల, కడప, జమ్మలమడుగు, మైదుకూరు ప్రాంతాలకు ఈ సరకు రవాణా అవుతోంది. ఇలాంటి అక్రమార్కులపై పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.
బెల్ట్ దుకాణాల జోరు..
పలు ప్రాంతాల్లో మద్యం దుకాణదారుల ఆధ్వర్యంలోనే బెల్ట్ దుకాణాలు నడుస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరికొందరు తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు కూల్‌డ్రింక్ షాపులు, హోటళ్లు, దాబాల్లో మద్యం తాగేందుకు అవకాశం కల్పిస్తున్నారని చెబుతున్నారు. పట్టణాలతో పాటు అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మద్యం మత్తులో తీవ్రమైన గొడవలు, సంఘర్షణలు జరిగితేనే అధికారులు కదిలి దాడులు నిర్వహిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఆ తర్వాత మళ్లీ పరిస్థితి యథాతథంగానే కొనసాగుతోందని వారి వాదన. ఇటీవల జిల్లాలో బెల్ట్ దుకాణాలు, అక్రమ మద్యం విక్రయాలపై పోలీసులు దాడులు నిర్వహించినప్పుడు పలుచోట్ల మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో గత ఐదు నెలల్లో బెల్ట్ షాపులపై 103 కేసులు నమోదు కాగా, 103 మందిని అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ దాడుల్లో 118 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఈ చర్యలు అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు సరిపోవట్లేదని, సమీక్షలు, హెచ్చరికలకే పరిమితం కాకుండా బెల్ట్ దుకాణాలను పూర్తిగా మూసివేసే దిశగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.













