కడప : భూత, భవిష్యత్, వర్తమాన కాలాలలో జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి ముందుగానే కాలజ్ఞానం ద్వారా ప్రపంచానికి తెలియజేసిన పవిత్ర శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం ప్రస్తుతం అరాచకాలకు కేంద్రంగా మారిందని పూర్వ పీఠాధిపతి శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి ధర్మపత్ని మారుతి మహాలక్ష్మి ఆరోపించారు. కడప ప్రెస్ క్లబ్‌లో ఆమె మీడియా సమావేశం నిర్వహించి, బ్రహ్మంగారిమఠంలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

బ్రహ్మంగారిమఠం పవిత్రతను కాపాడాల్సిన కొందరి స్వార్థ రాజకీయాల వల్ల ఈ ఆధ్యాత్మిక కేంద్రం రౌడీ రాజ్యాన్ని తలపిస్తోందని ఆమె విమర్శించారు. ధార్మిక పరిషత్ కేవలం మూడు నెలలపాటు సజావుగా వ్యవహారాలు సాగేందుకు తాత్కాలిక మఠాధిపతిగా వెంకటాద్రి స్వామిని నియమించగా, ఆయన ఆ పదవిని శాశ్వత అడ్డాగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, దీనిపై శారద గురుపీఠ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోందని తెలిపారు.

బ్రహ్మంగారిమఠం ఆధార వ్యవహారాలపై కనీస అవగాహనలేని వెంకటాద్రి స్వామిని తాత్కాలిక మఠాధిపతిగా నియమించడం మూలాలకు ముప్పుగా మారిందని మారుతి మహాలక్ష్మి పేర్కొన్నారు. గురుపత్ని అని కూడా చూడకుండా అశ్లీల అర్ధనగ్న నటీమణుల సోషల్ మీడియా పేజీలు, డేటింగ్ యాప్‌లు ఫాలో అయ్యే వ్యక్తి మఠానికి పీఠాధిపతిగా ఉండటం తీవ్రంగా అభ్యంతరకరమని ఆమె విమర్శించారు.

పూర్వ మఠాధిపతి చేత తదుపరి మఠాధిపతిగా నియమితులైన, వేదాంతం అభ్యసించిన గోవిందస్వామిని తొలగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. గోవిందస్వామిని ఉద్దేశించి వెంకటాద్రి స్వామి అమానవీయంగా దూషణలు, బెదిరింపులు చేసినట్లు పేర్కొన్నారు. దీనిపై స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయకపోవడం పోలీసుల తీరుపై సందేహాలు రేకెత్తిస్తున్నాయని తెలిపారు.

బ్రహ్మంగారిమఠం నుంచి మేనేజర్‌గా డిస్మిస్ అయిన పిపిఎన్ ప్రసాద్ ప్రోద్బలంతోనే ఈ అరాచకాలు జరుగుతున్నాయని మారుతి మహాలక్ష్మి ఆరోపించారు. బ్రహ్మంగారిమఠంతో ఎలాంటి సంబంధం లేని పిపిఎన్ ప్రసాద్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర బెదిరింపులకు పాల్పడుతున్నారని, మహిళలు, పిల్లలపై కూడా హత్యాయత్నపు బెదిరింపులు చేస్తున్న ఆడియోలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

పవిత్ర శ్రీరామనవమి రోజున పిపిఎన్ ప్రసాద్, ఆయన అనుచరులు, తాత్కాలిక మఠాధిపతి వెంకటాద్రి స్వామి దత్తాత్రేయులు కలిసి తాను ఉంటున్న గది తాళాలు బలవంతంగా పగులగొట్టి సామగ్రి అపహరించారని మారుతి మహాలక్ష్మి ఆరోపించారు. నిద్రించే గదిలో అత్యంత విషపూరితమైన మందులు కొట్టించి భయాందోళనలకు గురిచేశారని, అప్పటి నుంచి పిల్లలతో కలిసి పంచలో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా, ప్రధాన నిందితుడైన వెంకటాద్రి స్వామి పేరును ఎఫ్‌ఐఆర్‌లో తొలగించారని ఆమె మండిపడ్డారు.

ఏప్రిల్ మొదటి వారంలో తాను పడుకునే గది ఫ్లోరింగ్‌ను బలవంతంగా తవ్వేయడంతో వరండాలోనే నిద్రించాల్సి వస్తోందని మారుతి మహాలక్ష్మి చెప్పారు. హిందూ మతం, వేదాంతంపై అవగాహనలేని వ్యక్తికి మఠాధిపతిగా అర్హత లేదని భావించిన పూర్వ మఠాధిపతి గోవిందస్వామిని మఠాధిపతిగా నియమిస్తూ, మఠం లాయర్ ద్వారా విలునామా రాయించారని ఆమె వివరించారు.

బ్రహ్మంగారిమఠాన్ని ఫ్యాక్షన్ రాజకీయాల వేదికగా మార్చి, మహిళలపై అసభ్య ప్రచారాలు చేస్తున్న అరాచక శక్తులపై ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాలని మారుతి మహాలక్ష్మి విజ్ఞప్తి చేశారు. వెంకటాద్రి స్వామి, పిపిఎన్ ప్రసాద్, దత్తాత్రేయులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి, మంత్రి నారా లోకేష్, స్థానిక ఎమ్మెల్యేలకు ఆమె అభ్యర్థించారు. ఆధ్యాత్మిక కేంద్రమైన బ్రహ్మంగారిమఠం పవిత్రతను కాపాడాలని ఆమె కోరారు.