రాయలసీమ న్యూస్, డిస్ట్రిక్ట్ న్యూస్ డెస్క్:
పచ్చదనం పెంపు వ్యక్తిగత బాధ్యత : కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి
వైఎస్ఆర్ కడప : మొక్కల పెంపకం, పచ్చదనం పరిరక్షణ వంటి కార్యక్రమాలను సామాజిక బాధ్యతగానే కాకుండా వ్యక్తిగత బాధ్యతగా ప్రతి ఒక్కరూ స్వీకరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం - 2026 సందర్భంగా శుక్రవారం కడప నగర వనంలో జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, డిఎఫ్ఓ వినీత్ కుమార్, పలువురు అధికారులు, విద్యార్థులు, మహిళలతో కలిసి వారికి కేటాయించిన స్థలాల్లో అడవి జాతి మొక్కలను నాటారు. హరితాంధ్ర ప్రదేశ్ లక్ష్య సాధనలో భాగంగా ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములయ్యారు. అనంతరం సీడ్ బాల్స్ విశిష్టతను అధికారులు కలెక్టర్‌కు వివరించగా, డ్రోన్ సహాయంతో సీడ్ బాల్స్ విసిరే కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు.
తరువాత ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ యజ్ఞంలో భాగస్వాములు కావాలని సూచించారు. ప్రకృతి తల్లిలాంటిదని, చెట్లు ప్రాణికోటికి ప్రాణాధారం అన్న విషయాన్ని ఆయన వివరించారు. పర్యావరణ పరంగా గతంలో జరిగిన నష్టాలను పూడ్చే దిశగా ఈ తరం యువత సమాజ పునర్నిర్మాణంలో ముందుండాలని పిలుపునిచ్చారు. హరితాంధ్ర ప్రదేశ్ సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ప్రతి ఇల్లు, ప్రతి ఊరు పచ్చదనంతో కళకళలాడేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రాన్ని 50 శాతం పచ్చదనంతో నింపాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా జూన్ 5 పర్యావరణ దినోత్సవం నుంచి వచ్చే కార్తీక మాసం వరకు, వర్షాలు విరివిగా కురిసే సీజన్‌లో, రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
అదే స్పూర్తితో జిల్లాలో కూడా డ్రోన్ సహకారంతో దాదాపు వెయ్యి హెక్టార్లలో సీడ్ బాల్స్ త్రోయింగ్ ద్వారా విస్తృతంగా మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు కలెక్టర్ వివరించారు. సమాజ హితం కోసం ప్రతి ఒక్కరూ తమ చుట్టూ ఉన్న పరిసరాలను పచ్చదనంతో నింపాలని ఆయన ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణ బాధ్యత మన ఇంటి నుంచే ప్రారంభమై సమాజానికి విస్తరించాల్సిన అవసరం ఉందని, మనతో పాటు మన చుట్టూ ఉన్న జీవరాశులను కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని సూచించారు.
డిఎఫ్ఓ వినీత్ కుమార్ మాట్లాడుతూ, జిల్లా విస్తీర్ణంలో అడవులు 33 శాతం మేర విస్తరించి ఉండటంతో అటవీ విస్తీర్ణంలో వైఎస్ఆర్ కడప జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉందని తెలిపారు. జిల్లాలో పచ్చదనాన్ని మరింతగా పెంచేందుకు సామాజిక అడవుల పెంపకం, గ్రామీణ ఉపాధి హామీ పథకం, స్వయం సహాయక సంఘాల మహిళల భాగస్వామ్యంతో ఒక వైపు ప్రజలకు ఉపాధి కల్పిస్తూ, మరోవైపు పచ్చదనాన్ని విస్తరించే చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన వనమహోత్సవం ద్వారా జిల్లాలో విస్తృతంగా మొక్కలు నాటి అటవీ విస్తీర్ణాన్ని 50 శాతానికి పెంచేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమం ముగిసిన అనంతరం హాజరైన వారికి వివిధ రకాల మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కడప ఆర్డీవో మురళీ, స్వాడ్ డిఎఫ్ఓ రాజశేఖర్, కేఎంసి అదనపు కమిషనర్ రాకేష్ చంద్రం, డీఏవో సుబ్రహ్మణ్యేశ్వర రావు, డిసిహెచ్ఎస్ డాక్టర్ హిమదేవి, అటవీశాఖ, డ్వామా, రెవెన్యూ శాఖల అధికారులు, సిబ్బంది, స్వచ్చంద సేవా సంస్థల ప్రతినిధులు, మహిళలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.













