రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప:- ప్రజా ఫిర్యాదులను బాధ్యతాయుతంగా, ఆలస్యం లేకుండా పరిష్కరించడంతో పాటు మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ సభాభవన్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, జేసీ డా. నిధీమీనా కలిసి ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. వివిధ గ్రామాలు, పట్టణాల నుంచి వచ్చిన ప్రజలు భూ సమస్యలు, సేవల అందుబాటు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై తమ ఫిర్యాదులు, వినతిపత్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని అధికారులకు గుర్తుచేశారు. అధికారులు అలసత్వం వీడి ప్రతి అర్జీపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ల సేవలను సమర్థంగా వినియోగించుకోవాలని ప్రజలకు వివరించారు.
జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా మొత్తం పనితీరు మెరుగ్గా ఉన్నప్పటికీ, అర్జీల పరిష్కారంలో ఎక్కడా జాప్యం జరగకుండా అన్ని శాఖల అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించి, అర్జీదారులతో మాట్లాడి వాస్తవ పరిస్థితులను తెలుసుకుని, సమస్య స్వరూపానికి అనుగుణంగా సరైన పరిష్కారం చూపాలని ఆదేశించారు. పొంతనలేని నివేదికలు సమర్పించరాదని హెచ్చరించారు.

తహసీల్దార్లు, శాఖాధిపతులు, ప్రజా సమస్యల పరిష్కార వేదిక సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి, సమాచార లోపాలు లేకుండా చూడాలని సూచించారు. పరిష్కరించిన అర్జీలపై ప్రజల సంతృప్తి స్థాయిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని, అందువల్ల ప్రతి ఫిర్యాదును నాణ్యతతో పరిష్కరించి అర్జీదారులకు న్యాయం జరిగేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ తెలిపారు.
అదేవిధంగా మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చేపట్టాల్సిన కార్యక్రమాలను ముందుగానే గుర్తించి, సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, వసతులు, లాజిస్టిక్ ఏర్పాట్లు వంటి అంశాలపై ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్వో మల్లికార్జునుడు, డిప్యూటీ కలెక్టర్లు రంగస్వామి, వెంకటపతి, శివరామిరెడ్డి, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ జి. రాజ్యలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.













