రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప జిల్లా సమగ్ర అభివృద్ధి, వివిధ ప్రభుత్వ శాఖల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై మంగళవారం జిల్లా సమీక్షా కమిటీ సమావేశం జరిగింది. కడప కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్ హాలులో జరిగిన ఈ సమావేశంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఆధ్వర్యంలో, రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖల మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీమతి ఎస్. సవిత అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జిల్లాలో అమలవుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై శాఖల వారీగా సమీక్ష చేపట్టారు.

జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, వివిధ శాఖల ప్రగతి, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలను సమావేశంలో వివరించారు. అనంతరం అజెండాలోని అంశాల వారీగా సంబంధిత శాఖల అధికారులు తమ శాఖల పరిధిలో సాధించిన ప్రగతి, చేపడుతున్న కార్యక్రమాలు, పనుల పురోగతిని ప్రజాప్రతినిధులకు వివరించారు.

ఈ సందర్భంగా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనులు, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, సాగు మరియు తాగునీటి సమస్యలు, రహదారులు, విద్య, వైద్యం తదితర అంశాలకు సంబంధించి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అధికారులు దృష్టికి పలు అంశాలను తీసుకెళ్లారు. నియోజకవర్గ ప్రజల అవసరాలకు అనుగుణంగా చేపట్టిన పనులను వేగవంతం చేయడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాలని కోరారు.

ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలపై సంబంధిత శాఖలు వేగంగా చర్యలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.

జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్రీమతి నిధిమీనా, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, రాష్ట్ర షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ Vs ముక్తియార్, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.













