కడప : ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌) మ్యాచ్‌ల నిర్వహణకు కడప నగరంలోని వైఎస్‌ రాజారెడ్డి–ఏసీఏ స్టేడియం అన్ని విధాలుగా సిద్ధమైంది. బుధవారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు ఫ్లడ్‌లైట్ల వెలుగులో జరిగే ఈ టోర్నీలో రాయల్స్‌ ఆఫ్‌ రాయలసీమ, భీమవరం బుల్స్‌, కాకినాడ కింగ్స్‌, అమరావతి రాయల్స్‌, వైజాగ్‌ లయన్స్‌, తుంగభద్ర వారియర్స్‌, విజయవాడ సన్‌షైనర్స్‌ జట్లు తలపడనున్నాయి.

మ్యాచ్‌ల కోసం అన్ని జట్ల క్రీడాకారులు ఇప్పటికే కడపకు చేరుకున్నారు. స్టేడియంలో పది వేల మంది వరకు ప్రేక్షకులు కూర్చుని ప్రత్యక్షంగా మ్యాచ్‌లను వీక్షించేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించారు. టోర్నీ విజయవంతం కావడానికి నిర్వాహకులు వినూత్న ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

విశాఖపట్నంకు చెందిన క్యూరేటర్‌ నాగమల్లయ్య నేతృత్వంలో కడప క్రికెట్‌ స్టేడియంలోని పిచ్‌లను సిద్ధం చేశారు. బ్యాట్స్‌మెన్లు క్రీజులో నిలదొక్కుకుంటే ఈ పిచ్‌లపై పరుగుల వరద పారే అవకాశం ఉందని క్రికెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కడపలో జరగనున్న మొత్తం తొమ్మిది మ్యాచ్‌లలో ఐదు ఫ్లడ్‌లైట్ల వెలుగులో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఏపీఎల్‌లో తలపడే వివిధ జట్లకు జిల్లాకు చెందిన తొమ్మిది మంది క్రికెటర్లు ఎంపిక కావడం స్థానిక క్రీడాభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది. వీరిలో ధృవకుమార్‌రెడ్డి, సుదర్శన్‌, షరీప్‌ పఠాన్‌, ఆరీఫ్‌బాష, రోహిత్‌ వర్మ (రాయల్స్‌ ఆఫ్‌ రాయలసీమ), హరిశంకర్‌రెడ్డి, వరుణ్‌ (కాకినాడ కింగ్స్‌), జహీర్‌ అబ్బాస్‌ (విజయవాడ సన్‌షైనర్స్‌), ధనుష్‌ (సింహాద్రి వైజాగ్‌ లయన్స్‌) ఉన్నారు.

ఏపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణను దృష్టిలో పెట్టుకుని కడప స్టేడియాన్ని ఆధునికీకరించారు. మౌలిక సదుపాయాల కల్పనకు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ సుమారు రూ.7 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో స్టేడియం ముఖద్వారం పనులు, ఆటగాళ్ల డ్రస్సింగ్‌ రూంల ఆధునికీకరణ, ఆటగాళ్లు, ప్రాంఛైజీలు మ్యాచ్‌లను సౌకర్యవంతంగా వీక్షించేందుకు గ్లాస్‌ వర్క్స్‌, కార్పొరేట్‌ బాక్స్‌లు, డగౌట్స్‌, సైడ్‌ స్క్రీన్స్‌ వంటి సదుపాయాలు సమకూర్చారు.

మ్యాచ్‌ల విరామ సమయంలో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. 17న సినీ గాయని సునీత ప్రత్యక్ష సంగీత ప్రదర్శన, 18న కృష్ణచైతన్య ఇన్ఫ్యూషన్‌ బ్యాండ్‌, 19న బ్యాండ్‌ షహరీ లైవ్‌ ప్రదర్శన, 20న సినీ గాయని గీతా మాధురి ప్రత్యక్ష సంగీత ప్రదర్శన, అదే రోజు సింహ, బ్యాండ్‌ లైవ్‌ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. క్రీడాకారుల రాకపోకల కోసం ప్రత్యేక బస్సులను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం.