రాష్ట్రంలో ఐటీ రంగాన్ని వేగంగా విస్తరించడంతో పాటు జిల్లాల స్థాయిలో ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐటీ మౌలిక వసతుల ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన https://itinfra.ap.gov.in/#/home/landing పోర్టల్‌ ద్వారా జిల్లాలో అందుబాటులో ఉన్న ఐటీ సంబంధిత మౌలిక వసతుల వివరాలు పెట్టుబడిదారులకు సులభంగా చేరనున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఈ పోర్టల్‌లో ఆస్తుల వివరాలను నమోదు చేస్తే అవి నేరుగా పెట్టుబడిదారుల దృష్టికి చేరుతాయని, నమోదు ప్రక్రియ పూర్తిగా ఉచితమని కలెక్టర్ తెలిపారు. ఈ డిజిటల్‌ వేదిక ద్వారా జిల్లాలో ఉన్న భవనాలు, కార్యాలయ స్థలాలు, ఖాళీ అంతస్తులు, ఖాళీ భూములు వంటి మౌలిక వసతులపై సమగ్ర సమాచారం ఒకేచోట లభ్యమవడంతో కొత్త పరిశ్రమలు, ఐటీ సంస్థలు జిల్లాకు రావడానికి ఇది దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

పెద్ద పెద్ద భవనాల యజమానులే కాకుండా చిన్న వాణిజ్య భవనాలు, కార్యాలయ స్థలాలు, ఖాళీ అంతస్తులు, ఖాళీ భూములు కలిగిన వారంతా తమ ఆస్తులను ఈ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ విధంగా నమోదు చేసిన ఆస్తులను ఐటీ సంస్థలు, స్టార్టప్‌లు, గ్లోబల్ సామర్థ్య కేంద్రాలు, ఇతర సాంకేతిక సంస్థలకు లీజుకు ఇవ్వడం లేదా విక్రయించడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చని ఆయన వివరించారు.

జిల్లాలో ఉన్న చిన్న, పెద్ద వాణిజ్య భవనాలు, కార్యాలయ స్థలాలు లేదా ఖాళీ భూములు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఐటీ మౌలిక వసతుల పోర్టల్‌లో తమ ఆస్తుల వివరాలను నమోదు చేయాలని డా. శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు. ఈ పోర్టల్‌ ద్వారా పెట్టుబడిదారులు తమ అవసరాలకు అనుగుణంగా జిల్లాలో అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించి పరిశ్రమలు, ఐటీ సంస్థలను స్థాపించేందుకు ముందుకు రావచ్చని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వివరాల కోసం జిల్లా ఐటీ మేనేజర్‌ 90108 21844 నంబర్‌ను సంప్రదించవచ్చని కలెక్టర్ తెలిపారు. పోర్టల్‌ వినియోగం, నమోదు విధానం, అవసరమైన వివరాలపై జిల్లా ఐటీ విభాగం ద్వారా మార్గదర్శకత్వం అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు.