వైఎస్సార్ కడప జిల్లాకు సంబంధించిన ఎస్‌ఐఆర్–2026 ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం కింద ముసాయిదా ఫోటో ఓటరు జాబితాను జిల్లా కలెక్టర్ & జిల్లా ఎన్నికల అధికారి డా. శ్రీధర్ చెరుకూరి విడుదల చేశారు. 2026 జూలై 1ను అర్హత తేదీగా పరిగణిస్తూ సిద్ధం చేసిన ఈ ముసాయిదా జాబితాను శుక్రవారం ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు.

జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం, అన్ని ఎన్నికల నమోదు అధికారుల కార్యాలయాలు, సహాయ ఎన్నికల నమోదు అధికారుల కార్యాలయాలు, అలాగే నియోజకవర్గాల పరిధిలోని గుర్తించిన పోలింగ్ కేంద్రాల్లో ముసాయిదా ఓటరు జాబితా ఉంచినట్లు డా. శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. ప్రజలు తమ పేర్లు, చిరునామాలు, ఇతర వివరాలను సులభంగా పరిశీలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు.

జిల్లాలో మొత్తం 16,51,312 మంది సాధారణ ఓటర్లు ముసాయిదా జాబితాలో నమోదయ్యారని జిల్లా కలెక్టర్ తెలిపారు. వీరిలో పురుష ఓటర్లు 8,09,839 మంది, మహిళా ఓటర్లు 8,41,337 మంది, తృతీయ జెండర్‌కు చెందిన ఓటర్లు 136 మంది ఉన్నట్లు వెల్లడించారు. అదనంగా సర్వీస్ ఓటర్లు 2,217 మంది నమోదు అయ్యారని, వీరిలో పురుషులు 2,158 మంది, మహిళలు 59 మంది ఉన్నట్లు వివరించారు.

నియోజకవర్గాల వారీగా ఓటర్ల సంఖ్యను పరిశీలిస్తే జమ్మలమడుగు నియోజకవర్గంలో అత్యధికంగా 2,22,619 మంది ఓటర్లు ఉన్నారని, కమలాపురం నియోజకవర్గంలో అత్యల్పంగా 1,84,559 మంది ఓటర్లు నమోదయ్యారని డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. బడ్వేల్ నియోజకవర్గంలో 2,00,193 మంది, రాజంపేటలో 2,15,825 మంది, కడపలో 2,17,415 మంది, పులివెందులలో 2,00,531 మంది, కమలాపురంలో 1,84,559 మంది, జమ్మలమడుగులో 2,22,619 మంది, ప్రొద్దుటూరులో 2,18,603 మంది, మైదుకూరులో 1,91,567 మంది ఓటర్లు ముసాయిదా జాబితాలో ఉన్నట్లు వివరించారు.

ముసాయిదా జాబితాలో తమ పేరు, చిరునామా, ఇతర వివరాలను ప్రతి ఓటరు తప్పనిసరిగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఏవైనా తప్పులు, అభ్యంతరాలు లేదా మార్పులు అవసరమైతే ఎన్నికల శాఖ నిర్దేశించిన గడువులోగా సంబంధిత ఎన్నికల నమోదు అధికారులకు దరఖాస్తులు సమర్పించి సరిచేసుకునే అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

తుది ఓటరు జాబితా రూపొందించే ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని, ముసాయిదా దశలోనే వివరాలను సరిచేసుకోవడం ద్వారా ఎన్నికల నిర్వహణ మరింత పారదర్శకంగా, సమర్థంగా సాగుతుందని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఈ సందర్భంగా పేర్కొన్నారు.