రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో వరుసగా మోటార్ సైకిల్ దొంగతనాలు చేస్తున్న Swiggy డెలివరీ బాయ్‌ను ప్రొద్దుటూరు 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాత బీగాలు, మాస్టర్ కీ ఉపయోగించి లాక్ చేసిన బైక్‌లను సులువుగా దొంగిలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అరెస్టు చేసిన ముద్దాయి వద్ద నుండి మొత్తం ఏడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 3.50 లక్షలుగా పోలీసులు అంచనా వేస్తున్నారు

.
ఈ ఘటనపై ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూ కృష్ణ ఐపీఎస్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలను వెల్లడించారు. అరెస్టైన సూర్య గురు తేజ (22 సంవత్సరాలు) Swiggy డెలివరీ బాయ్‌గా పని చేస్తూ, ప్రొద్దుటూరు పరిధిలోని పెన్నా నగర్‌లో నివాసం ఉంటున్నాడని తెలిపారు.
కేసు వివరాలను వెల్లడిస్తూ పోలీసులు, ఆగస్టు 3, 2026న మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో వచ్చిన సమాచారం మేరకు ఈశ్వర్ రెడ్డి నగర్‌లోని అక్క దేవతల గుడి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న సూర్య గురు తేజను సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు మరియు వారి సిబ్బంది అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. పెద్దమనుషుల సమక్షంలో విచారణ జరిపినప్పుడు, అతను పట్టణంలో వరుసగా బైక్ చోరీలు చేసినట్లు అంగీకరించినట్టు తెలిపారు.
పాత బీగాలు, మాస్టర్ కీ ఉపయోగించి లాక్ చేసిన మోటార్ సైకిళ్లను సులభంగా తెరిచి దొంగిలిస్తున్నట్లు సూర్య గురు తేజ విచారణలో ఒప్పుకున్నాడని పోలీసులు వివరించారు. అనంతరం అదే రోజు మధ్యాహ్నం 5.00 గంటలకు అతనిని అధికారికంగా అరెస్ట్ చేసి, ప్రొద్దుటూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
ముద్దాయి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న ఏడు బైక్‌లు వివిధ కంపెనీలకు చెందినవిగా గుర్తించారు. మొత్తం వాహనాల విలువ సుమారు రూ. 3,50,000/- ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో మొదటి ఫిర్యాదుదారుగా జేష్టాది సునీల్ కుమార్ (32 సంవత్సరాలు), ప్రభుత్వ ఆసుపత్రి టెక్నీషియన్, మాలెపాడు గ్రామం, యర్రగుంట్ల మండలం చెందిన వ్యక్తి ఉన్నట్లు పేర్కొన్నారు.
పట్టణంలో పెరుగుతున్న బైక్ దొంగతనాల నేపథ్యంలో వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. వాహనాలను సురక్షిత ప్రదేశాల్లో పార్క్ చేయడం, డబుల్ లాక్ వినియోగించడం, అనుమానాస్పద వ్యక్తులను గమనించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
పట్టణంలో వాహనదారులు తమ బైక్‌లను సురక్షిత ప్రదేశాల్లో పార్క్ చేయాలి, డబుల్ లాక్ వేయాలి, అనుమానాస్పద వ్యక్తులను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న బైక్ చోరీలను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిఘా పెంచినట్లు ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూ కృష్ణ ఐపీఎస్ తెలిపారు. వాహనదారుల సహకారంతోనే ఈ తరహా నేరాలను సమర్థవంతంగా అరికట్టగలమని పోలీసులు పేర్కొన్నారు.













