జిల్లాలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో స్మార్ట్ కిచెన్ వ్యవస్థను దశలవారీగా జిల్లా వ్యాప్తంగా విస్తరింపజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. మంగళవారం ఆయన పలు పాఠశాలల్లో ఏర్పాటు చేసిన స్మార్ట్ కిచెన్లను ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా పెండ్లిమర్రి మండలం వెల్లటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పులివెందుల బాలుర, బాలికల జెడ్పీ ఉన్నత పాఠశాల, చెన్నూరు మండలంలోని కొండపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన స్మార్ట్ కిచెన్ల పనితీరును జిల్లా కలెక్టర్ పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, కిచెన్లలో ఆహార తయారీ విధానం, పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలు, రవాణా, పాఠశాలలకు భోజనం చేరవేత వంటి అంశాలను ఆయన సమగ్రంగా పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

పులివెందులలో పాత్రికేయులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, గత ఏడాది కడప నగర పాలక సంస్థ పరిధిలోని రెండు మండలాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన స్మార్ట్ కిచెన్లు విజయవంతం కావడంతో, ఆ అనుభవాన్ని ఆధారంగా తీసుకుని ఇప్పుడు జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలను స్మార్ట్ కిచెన్ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

ప్రస్తుతం జిల్లాలో 20 స్మార్ట్ కిచెన్లు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని, వచ్చే వారంలో మరో 13 స్మార్ట్ కిచెన్లు అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు. ప్రతి స్మార్ట్ కిచెన్ పరిధిలో దశలవారీగా మరో ఒకటి లేదా రెండు పాఠశాలలను చేర్చుతూ వ్యవస్థను విస్తరింపజేస్తున్నట్లు పేర్కొన్నారు.

పులివెందులలో జెడ్పీ బాలుర హైస్కూల్‌లో స్మార్ట్ కిచెన్ భవనాల నిర్మాణం, ఆకర్షణీయమైన గోడ చిత్రాలు, ప్రదర్శన బోర్డులు, ఇతర మౌలిక సదుపాయాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం బాలికల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులకు మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్న తీరును, వంట నిర్వాహకులు పాటిస్తున్న పరిశుభ్రత ప్రమాణాలను ప్రత్యక్షంగా తనిఖీ చేశారు.

తరువాత విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్, అన్నం, కూరలు, ఇతర ఆహార పదార్థాలను స్వయంగా రుచి చూసి వాటి నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్శనలో సంబంధిత శాఖల అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.