రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: నటి సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాజ్ నిడిమోరు, సమంత, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించారు. దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 19న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.
సినిమా విడుదలకు ముందుగా సోమవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకులు దేవా కట్టా, డీకే, రాహుల్ రవీంద్రన్, నిర్మాతలు డి.సురేశ్‌బాబు, వై.రవిశంకర్, స్వప్న దత్ తదితరులు అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సమంత సినిమా నిర్మాణ ప్రయాణం, తన అనుభవాల గురించి మాట్లాడింది. నటిగా ఇప్పటి వరకు తన కెరీర్ సాఫీగా సాగిందని, అయితే నటిగా, నిర్మాతగా ఒకేసారి బాధ్యతలు నిర్వర్తించడం ఎంత కష్టమో ఇప్పుడు బాగా అర్థమవుతోందని ఆమె పేర్కొంది. ఈ చిత్రం సమష్టి కృషి ఫలితమని, అందరి సహకారంతోనే ఇది సాధ్యమైందని సమంత అభిప్రాయపడింది.
దర్శకురాలు నందినీ రెడ్డి కూడా ఈ సందర్భంగా చిత్ర నిర్మాణం, బృందం కృషి గురించి వివరించింది. తన కెరీర్‌లో ఇప్పటివరకు ఏ సినిమాకీ పడనింత కష్టం ఈ చిత్రానికి పడిందని, ఆరు నెలల వ్యవధిలో సమష్టి కృషితో చిత్రీకరణ పూర్తి చేయగలిగామని ఆమె తెలిపింది. సమంత, రాజ్ నిడిమోరు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని నందినీ రెడ్డి అభిప్రాయపడింది. ఈ నెల 19న ప్రేక్షకులు సమంతను మరింత భిన్నంగా, బలమైన పాత్రలో చూడబోతున్నారని ఆమె పేర్కొంది.
ప్రీరిలీజ్ వేడుకకు చిన్మయి, దిగంత్, ఆనంద్, హిమాంక్, శ్రీలక్ష్మి, గవిరెడ్డి, పొనీ వర్మ తదితరులు హాజరయ్యారు. చిత్ర బృందం మొత్తం కలిసి వేదికపై సందడి చేస్తూ, సినిమా విజయంపై నమ్మకం వ్యక్తం చేసింది.













