ప్రొద్దుటూరు, జూన్ 12: పేదలకు సొంతింటి కలను సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో హౌసింగ్ పథకం అమలులో చోటుచేసుకున్న అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టి అర్హులందరికీ న్యాయం చేయనున్నట్లు తెలిపారు.

గురువారం ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని బొల్లవరం హౌసింగ్ లేఅవుట్‌ను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డితో కలిసి మంత్రి కొలుసు పార్థసారథి సందర్శించారు. అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాలను పరిశీలించిన ఆయన, లబ్ధిదారులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

గతంలో హౌసింగ్ పథకం అమలులో అనేక అవకతవకలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. లబ్ధిదారుల ఎంపిక, ప్లాట్ల కేటాయింపు, గృహ నిర్మాణాల నిర్వహణలో అక్రమాలు చోటుచేసుకున్నాయని తెలిపారు. ముఖ్యంగా మెప్మా మహిళా సంఘాలకు సంబంధించిన నిధుల వినియోగంలో సుమారు రూ.48 కోట్ల మేర గోల్‌మాల్ జరిగినట్లు ఫిర్యాదులు అందాయని, వాటిపై సమగ్ర విచారణకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. వాస్తవాలను వెలికితీసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, పేదల కోసం కేటాయించిన నిధులను దుర్వినియోగం చేసిన వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు.

ప్రొద్దుటూరు నియోజకవర్గంలో హౌసింగ్ కార్యక్రమం పురోగతిని వివరించిన మంత్రి, రామేశ్వరం, బొల్లవరం, మీనాపురం లేఅవుట్లలో మొత్తం 4,82,481 సెంట్ల విస్తీర్ణంలో 23,068 ప్లాట్లు అభివృద్ధి చేసినట్లు తెలిపారు. వీటిలో 19,924 ప్లాట్లు ఇప్పటికే లబ్ధిదారులకు కేటాయించగా, మిగిలిన 3,144 ప్లాట్లను కూడా త్వరలో అర్హులైన పేదలకు అందజేస్తామని చెప్పారు.

నియోజకవర్గంలో ఇప్పటివరకు 15,043 ఇళ్లకు అనుమతులు మంజూరు చేసినట్లు మంత్రి వివరించారు. అందులో పట్టణ ప్రాంతాల్లో 11,655 ఇళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3,388 ఇళ్లు ఉన్నాయని తెలిపారు. రామేశ్వరం లేఅవుట్‌లో 7,647 ప్లాట్లలో 6,712, బొల్లవరం లేఅవుట్‌లో 10,462 ప్లాట్లలో 9,373, మీనాపురం లేఅవుట్‌లో 4,959 ప్లాట్లలో 3,839 ప్లాట్లు ఇప్పటికే లబ్ధిదారులకు కేటాయించినట్లు వెల్లడించారు.

బొల్లవరం లేఅవుట్‌లో గృహ నిర్మాణాలు పూర్తి చేసిన లబ్ధిదారులకు త్వరలోనే ఇళ్లను అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లేఅవుట్లలో తాగునీరు, విద్యుత్, రహదారులు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా గృహ నిర్మాణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఇప్పటివరకు సుమారు 4.50 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేశామని, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మరో 4 లక్షల ఇళ్లను కూడా పూర్తి చేసి లబ్ధిదారుల చేతికి తాళాలు అందజేయనున్నట్లు వెల్లడించారు.

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ, ప్రొద్దుటూరులో ఒక్క అర్హుడూ ఇల్లు లేకుండా ఉండకూడదన్నదే తమ సంకల్పమని తెలిపారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో హౌసింగ్ లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, వాటి పరిష్కారానికి మంత్రి కొలుసు పార్థసారథి ప్రత్యేక చొరవ చూపడం అభినందనీయమని పేర్కొన్నారు.

గత ప్రభుత్వ హయాంలో హౌసింగ్ పథకం అమలులో అనేక లోపాలు, అక్రమాలు చోటుచేసుకోవడంతో వేలాది మంది పేదలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయించకపోవడం, నిర్మాణాలు మధ్యలో నిలిచిపోవడం, మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం వంటి సమస్యలు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయని వివరించారు.

బొల్లవరం హౌసింగ్ లేఅవుట్‌లో అనేక ఇళ్లు అసంపూర్తిగా ఉండటంతో లబ్ధిదారులు ఆర్థిక, సామాజిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిలిచిపోయిన గృహ నిర్మాణాలను తిరిగి గాడిలో పెట్టేందుకు చర్యలు ప్రారంభించిందని చెప్పారు. నిర్మాణాలు పూర్తిచేసే లబ్ధిదారులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.

ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని రామేశ్వరం, బొల్లవరం, మీనాపురం లేఅవుట్ల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, అంతర్గత రహదారులు వంటి మౌలిక సదుపాయాలను పూర్తిస్థాయిలో కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు. హౌసింగ్ పథకానికి సంబంధించిన ప్రతి ఫిర్యాదును పరిశీలించి అర్హులైన వారికి న్యాయం జరిగేలా చూస్తామని స్పష్టం చేశారు.

మెప్మా మహిళా సంఘాల నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని, విచారణలో వాస్తవాలు బయటపడితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు ఆర్డీఓ శిరీష, హౌసింగ్ సీఈ వేణుగోపాల్, జిల్లా హౌసింగ్ పీడి రాజారత్నం, తహశీల్దార్ ఉదయ భాస్కర్, హౌసింగ్ డీఈలు, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.