రాజుపాళెం: కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు రాజుపాళెం–పియస్ పరిధిలోని టంగుటూరు గ్రామంలో సోమవారం రాత్రి పోలీస్ కళా–జాగృతి బృందం ఆధ్వర్యంలో ‘‘మేలుకొలుపు’’ నాటక ప్రదర్శన జరిగింది. వర్గకక్షలు, సైబర్ నేరాల వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు అర్థమయ్యేలా ఈ నాటక రూపంలో వివరించారు. పోలీస్ కళా–జాగృతి ఇన్‌ఛార్జ్ జి. నరసరామ్ బృందం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఈ సందర్భంగా ప్రొద్దుటూరు రూరల్ సి.ఐ నాగభూషణ్ వర్గకక్షల దుష్పరిణామాలను ప్రస్తావిస్తూ, ప్రజలు సామాజిక ఐక్యతతో జీవించాలని సూచించారు. వర్గకక్షలకు దూరంగా ఉండి, పిల్లలకు మంచి విద్య అందించేందుకు తల్లిదండ్రులు కృషి చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. పిల్లల భవిష్యత్తు బంగారు భవితగా తీర్చిదిద్దేందుకు కుటుంబాలు, సమాజం కలిసి ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.

ముఠాకక్షలు మానండి… ఆత్మీయంగా జీవిద్దాం. మన బిడ్డల బంగారు భవితకు బాటలు వేద్దాం.

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సి.ఐ నాగభూషణ్ హెచ్చరించారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తెలియని లింకులు, సందేశాలు, కాల్స్‌పై నమ్మకం పెట్టుకోవద్దని సూచించారు. వ్యవసాయ రంగంలో మెరుగైన సేద్య విధానాలు అవలంబిస్తే మంచి దిగుబడులు సాధ్యమవుతాయని, రైతులు ఆధునిక పద్ధతులను నేర్చుకుని అమలు చేయాలని ఆయన సూచించారు.

రాజుపాళెం యస్‌.ఐ ప్రణయ్ రెడ్డి మాట్లాడుతూ, వర్గకక్షలతో బాధపడుతున్న కుటుంబాల జీవితాల్లో మార్పు తీసుకురావడమే ‘‘మేలుకొలుపు’’ నాటక లక్ష్యమని తెలిపారు. నాటక రూపంలో చూపిన సందేశాలు ప్రజలకు సులభంగా అర్థమవుతాయని, అవగాహన పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

కార్యక్రమంలో పోక్సో యాక్ట్, పిల్లల భద్రత, బాల్య వివాహాల ప్రమాదాలు, ఈవ్ టీజింగ్, డయల్–112 సేవల వినియోగం, రహదారి భద్రత, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సైబర్ నేరాల నుంచి రక్షణ వంటి అంశాలను వివరించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై నాటకాన్ని వీక్షించారు.

ఈ కార్యక్రమంలో రాజుపాళెం పోలీస్ స్టేషన్ సిబ్బంది, టంగుటూరు గ్రామ ప్రజలు పాల్గొని, పోలీస్ శాఖ చేపడుతున్న అవగాహన కార్యక్రమాలకు మద్దతు తెలిపారు.