రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్:
ప్రొద్దుటూరు పురపాలక పెట్రోల్ బంకులో కోట్ల రూపాయల అక్రమాలు
వైయస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంకు నిర్వహణలో భారీ స్థాయిలో నిధుల అక్రమ వినియోగం వెలుగులోకి వచ్చింది. అప్పుల రూపంలో ఇంధనం ఇచ్చి, అమ్మకాల ద్వారా వచ్చిన మొత్తాలను కొంతమంది అధికారులు, సిబ్బంది దుర్వినియోగం చేసినట్లు విచారణలో తేలింది. ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలోనే తొలిసారిగా 2022లో ప్రొద్దుటూరులో పురపాలక సంఘం ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు ఏర్పాటు చేశారు. ప్రజా సంస్థ నిర్వహిస్తున్న బంకు కావడంతో పారదర్శకత ఉంటుందని స్థానికులు భావించారు. అయితే కాలక్రమేణా ఇంధనాన్ని అప్పు రూపంలో ఇవ్వడం, ఆ తరువాత వసూళ్లు సక్రమంగా చేయకపోవడం, అమ్మకాల ద్వారా వచ్చిన నగదు లెక్కల్లో చూపకపోవడం వంటి అంశాలు బయటకు వచ్చాయి.
ఈ నేపథ్యంలో పురపాలక శాఖ అధికారులు నిర్వహించిన విచారణలో మొత్తం రూ.1.28 కోట్లకు పైగా నిధులు గల్లంతైనట్లు గుర్తించారు. పురపాలక శాఖ అనంతపురం ప్రాతీయ సంచాలకుడు ఈ విషయంపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. అందులో 15 మంది అధికారులు, సిబ్బంది పాత్ర ఉన్నట్లు పేర్కొన్నారు.
విచారణలో బయటపడిన వివరాల ప్రకారం పెట్రోల్ బంకు నిర్వహణలో కాజేసిన మొత్తం రూ.1,28,44,025లో ఇప్పటివరకు రూ.56,90,521 మాత్రమే రికవరీ చేశారు. ఇది మొత్తం అక్రమంగా వినియోగించిన నిధులలో 44.30 శాతం మాత్రమే. ఇంకా రూ.71,53,504 బకాయిగా ఉందని నివేదికలో స్పష్టం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23 నాటికి ఉన్న బకాయిల వివరాలను నమోదు చేసి, ఇందుకు బాధ్యులైన వారిపై తగిన శాసన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు.
ఈ వ్యవహారంలో పూర్వ పురపాలక కమిషనర్లు వెంకట రమణయ్య, మల్లికార్జున, రఘునాథరెడ్డి, ప్రస్తుత కమిషనర్ రవిచంద్రారెడ్డి, ప్రస్తుత మైదుకూరు పురపాలక కమిషనర్ వై.రంగస్వామి, మున్సిపల్ ఇంజినీర్ ఎం.శ్రీనివాసులు, జూనియర్ అసిస్టెంట్లు ప్రవీణ్‌కుమార్, ఓబులేసు, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లు రమేష్‌బాబు, డేవిడ్, అకౌంట్స్ ఆఫీసర్ రమేష్‌బాబు, సీనియర్ అకౌంటెంట్లు ప్రవీణ్‌కుమార్, ఇశ్రాయేలు, ఇన్‌ఛార్జి జూనియర్ అకౌంటెంట్ కె.ఎలిజబెత్ రాణి పేర్లు ఉన్నట్లు నివేదికలో పేర్కొనడం సంచలనంగా మారింది.
పెట్రోల్ బంకు ప్రారంభమైన నాటి నుంచి ఈ అక్రమాలు దశలవారీగా కొనసాగుతున్నప్పటికీ, అప్పటి కమిషనర్లు, సంబంధిత అధికారులు సమయానికి కట్టడి చేయకపోవడం వల్లే నిధుల స్వాహా ఇంత పెద్ద మొత్తానికి చేరిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రజా నిధులు ఈ విధంగా దుర్వినియోగం కావడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, గల్లంతైన మొత్తం మొత్తాన్ని వసూలు చేయాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.













