కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో వర్షాకాలం మొదలైనప్పుడల్లా పాత సమస్యలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. శాంతిభద్రతల పరంగా, వ్యాపార పరంగా ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ పట్టణంలో చిన్నపాటి వర్షం పడినా ప్రధాన రహదారులు చెరువులను తలపించేలా నీటమునిగిపోతున్నాయి. ప్రభుత్వం మారినా, ప్రజల రోజువారీ సమస్యలు మాత్రం మారకపోవడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కాలువల్లో పూడికలు తొలగించడం వంటి కనీస పారిశుద్ధ పనులు కూడా సక్రమంగా జరగకపోవడంపై ప్రజలు అధికార, ప్రతిపక్ష పార్టీల తీరును విమర్శిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్నా క్షేత్రస్థాయిలో అభివృద్ధి జరగలేదని ప్రతిపక్ష వైయస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. స్థానిక పత్రికల్లో కూడా “చెరువులను తలపిస్తున్న ప్రొద్దుటూరు మున్సిపల్ రోడ్లు” అంటూ వరుస కథనాలు వెలువడుతున్నాయి. ఈ విమర్శలన్నీ స్థానిక శాసనసభ్యుడు నంద్యాల వరదరాజులరెడ్డి వైపు మళ్లుతున్నాయి.

అయితే సమస్యకు మూలకారణం ఏమిటన్న దానిపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వైఎంఆర్ కాలనీలో పరిస్థితి మరింత దయనీయంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ఈ కాలనీలో చిన్నపాటి వర్షం కురిసినా రోడ్లపై మోకాళ్ల లోతు నీరు నిలిచిపోవడం సాధారణమైపోయింది.

దీనికి ప్రధాన కారణం మున్సిపల్ కాలువలపై విచ్చలవిడిగా వెలిసిన అక్రమ కట్టడాలేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. వైఎంఆర్ కాలనీ ఆంజనేయస్వామి దేవాలయం ఎదురుగా, పార్కు ఎదురుగా ఉన్న రూములు, గదులు పూర్తిగా మున్సిపల్ కాలువలపైనే శాశ్వత నిర్మాణాలుగా నిలిచాయి. కొందరు దుకాణదారులు కాలువలను, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తూ లక్షల రూపాయలు ఆర్జిస్తున్నప్పటికీ, మున్సిపల్ ఆదాయానికి మాత్రం నామమాత్రపు పన్నులు చెల్లించి బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇదే ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన రాయుడు టీ అంగడి , రాయుడు దోస అంగడి వంటి టిఫిన్ సెంటర్లు ఉన్నాయి. తెల్లవారుజాము నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ ప్రాంతం కిటకిటలాడుతూ ఉంటుంది. పట్టణం నలుమూలల నుంచి ప్రజలు టీ, టిఫిన్ల కోసం ఇక్కడికి తరలివస్తుంటారు. వ్యాపారాలు చురుగ్గా సాగుతున్నా, ఆ వెనుక పారిశుద్ధ కార్మికులు పడుతున్న వేదన తీవ్రంగా ఉందని మున్సిపల్ వర్గాలు చెబుతున్నాయి.

వర్షం కురిసి నీరు నిలిచిపోయినప్పుడు మున్సిపల్ అధికారులు ఉదయాన్నే పారిశుద్ధ కార్మికులను నీటిని తొలగించేందుకు పంపుతున్నా, కాలువలపై శాశ్వత నిర్మాణాలు ఉండటంతో లోపల పూడిక తీయడం, అడ్డంకులను తొలగించడం వారికి అసాధ్యంగా మారుతోంది. మురికి కాలువల్లోకి దిగుతూ, తీవ్రమైన దుర్వాసన మధ్య పని చేయడం వల్ల పలువురు కార్మికులు అనారోగ్యానికి గురవుతున్నారని సమాచారం. ఇలాంటి శాశ్వత అక్రమ కట్టడాలపై సంబంధిత అధికారులు ఇప్పటివరకు పెద్దగా చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది.

గత మున్సిపల్ కమిషనర్ హయాంలో భారీ అవినీతి జరిగిందని, దాదాపు ఐదు కోట్ల రూపాయల వరకు అక్రమ సంపాదన జరిగిందని ఇటీవల మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారు మునిరెడ్డి బహిరంగంగా ఆరోపించారు. ఈ నేపథ్యంలో అక్రమ కట్టడాలను తొలగించడంలో గత పాలకులు, అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ప్రొద్దుటూరు మున్సిపల్ నూతన కమిషనర్‌గా తోడిక శ్రీనివాస్ విశ్వనాధ్ బాధ్యతలు చేపట్టారు. ఆయన కాలువలపై ఉన్న ఈ శాశ్వత అక్రమ కట్టడాలను తొలగించి, ప్రొద్దుటూరు పట్టణ ప్రజలను వర్షాకాల ముప్పు నుంచి విముక్తి కల్పిస్తారా, లేక గతంలో మాదిరిగానే సమస్యను పట్టించుకోకుండా వదిలేస్తారా అన్నది ఇప్పుడు ప్రొద్దుటూరు ప్రజలలో చర్చనీయాంశంగా మారింది.