ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 3: పోలీస్ అధికారులు, సిబ్బందికి మెరుగైన పని వాతావరణం కల్పించడంతో పాటు, వివిధ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలకు మరింత సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో ఆధునిక సదుపాయాలతో పునరుద్ధరించిన ప్రొద్దుటూరు Sub-Divisional Police Officer (SDPO) కార్యాలయాన్ని జిల్లా SP శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, IPS గురువారం ప్రారంభించారు.

మధ్యాహ్నం 12.30 గంటలకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో Additional SP శ్రీ కె. ప్రకాష్ బాబు, ప్రొద్దుటూరు ASP శ్రీ యు. విబు కృష్ణ, IPS తో పాటు ప్రొద్దుటూరు Sub-Division పరిధిలోని CIలు, SIలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

పోలీస్ శాఖలో మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడంలో భాగంగా SDPO కార్యాలయాన్ని ఆధునిక సౌకర్యాలతో పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. పోలీస్ అధికారులు, సిబ్బంది విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అనువైన వాతావరణం కల్పించడంతో పాటు, పోలీస్ సేవల కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలకు సౌకర్యవంతమైన వాతావరణం అందించడమే ఈ పునరుద్ధరణ ప్రధాన ఉద్దేశ్యమని వారు పేర్కొన్నారు.

కార్యాలయ పునరుద్ధరణ పనులకు ప్రొద్దుటూరులోని Swaroop Eye Hospitals‌కు చెందిన డాక్టర్ వై.వి. స్వరూప్ కుమార్ రెడ్డి ప్రధానంగా ఆర్థిక సహకారం అందించారు. పోలీస్ శాఖ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆయన అందించిన సహకారాన్ని జిల్లా SP శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ప్రత్యేకంగా అభినందించారు.

అదేవిధంగా కార్యాలయ పునరుద్ధరణకు శ్రీ వి. జయచంద్ర రెడ్డి (CBIT), డాక్టర్ కె.వి.ఆర్. ప్రదీప్ రెడ్డి, డాక్టర్ ఎన్. నాగార్జున యాదవ్, శ్రీ దండపాణి శ్రీనివాసకుమార్, శ్రీ నాగూర్ బాషా (GIT), శ్రీ ఎస్. నాగిరెడ్డి (AGM, SCS), శ్రీ చెన్న శ్రీనివాసులు, శ్రీ కె. గంగిరెడ్డి, శ్రీ పి. మహేశ్వర్ రెడ్డి, శ్రీ పి. రాజేష్ రెడ్డి, శ్రీ ఎం. శంకర్ రెడ్డి తదితరులు ఆర్థిక సహకారం అందించారు.

ఈ సందర్భంగా జిల్లా SP మాట్లాడుతూ, పోలీస్ శాఖ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రజలు, ప్రముఖులు, దాతలు, శ్రేయోభిలాషులు అందిస్తున్న సహకారం ఎంతో అభినందనీయమని అన్నారు. సమాజంలోని వివిధ వర్గాల సహకారంతో పోలీసులకు మెరుగైన పని పరిస్థితులు కల్పించడంతో పాటు, ప్రజలకు మరింత సమర్థవంతమైన, నాణ్యమైన పోలీస్ సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు.