రాయలసీమ న్యూస్, డిస్ట్రిక్ట్ న్యూస్ డెస్క్:
ప్రొద్దుటూరులో ఆర్ఎంపీ డాక్టర్లు, మెడికల్ స్టోర్లపై బెదిరింపులు:
కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్
ప్రొద్దుటూరు పట్టణంలో కొందరు గ్రూపులుగా ఏర్పడి ఆర్ఎంపీ డాక్టర్లను, మెడికల్ స్టోర్ నిర్వాహకులను బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై జిల్లా ఎస్పీ, కలెక్టర్ కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. స్థానిక ఏఎస్పీ ఇలాంటి వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు.
ప్రొద్దుటూరు లోని తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో జరుగుతున్న అక్రమాలపై ఆయన స్పందించారు. కొందరు వ్యక్తులు బ్యాచులుగా ఏర్పడి ఆర్ఎంపీ డాక్టర్లు, మెడికల్ స్టోర్ యజమానులను లక్ష్యంగా చేసుకుని డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కొందరు ఫిర్యాదులు చేయడంతో, ఆ ఫిర్యాదుల పేరుతో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న విధానాన్ని కూడా ఎమ్మెల్యే ప్రస్తావించారు. ఆ తనిఖీల పేరుతోనే మెడికల్ స్టోర్ నిర్వాహకులు, ఆర్ఎంపీలపై దాడులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి చెప్పారు.
ప్రైవేటు పాఠశాలలపై కూడా ఇలాంటి దందాలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆయా విద్యాసంస్థల నిర్వాహకులు కూడా కలిసికట్టుగా ఉండాలని, ఎవరైనా బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. అలాంటి ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకునేలా చూస్తానని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి హామీ ఇచ్చారు.
ఎరువుల కొరత లేకుండా చూస్తా..
ఎరువుల కొరత పై ఈ సంవత్సరం రైతుల్లో ఆందోళన నెలకొంది. డిఏపీ, యూరియా దొరకడం లేదని చెబుతున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కొరత అనేది అపోహ మాత్రమే. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. మంత్రి, జిల్లా కలెక్టర్, జెడి తో మాట్లాడి రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తాను. వ్యవసాయ సీజన్ త్వరలో ప్రారంభం అవుతుంది. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుని ఎరువులను సీజన్ ముగిసేవరకు అవసరమైన మేరకు అందుబాటులో ఉంచేందుకు, నిల్వ చేస్తున్నట్లు ఎమ్మెల్యే వరద తెలిపారు. రైతులు ఎటువంటి ఆందోళన చెంద వద్దని స్పష్టం చేశారు.













