ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి పై టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జబీవుల్ల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు విషయంలో రాచమల్లు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు ప్రారంభం చంద్రబాబు హయాంలోనే జరిగిందని, భూసేకరణ సమయంలో రైతులతో ఫిర్యాదులు చేయించినది వైసీపీ ప్రభుత్వమేనని జబీవుల్ల ఆరోపించారు.

“రేపో మాపో కడప స్టీల్ ప్లాంట్‌ను కూడా మేమే కట్టామని రాచమల్లు చెప్పుకున్నా ఆశ్చర్యం లేదు”

రాచమల్లు వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తూ జబీవుల్ల పై విధంగా స్పందించారు. వైసీపీ పాలనలో ప్రొద్దుటూరులో పేదల భూములు భారీ స్థాయిలో కబ్జా అయ్యాయని, పేదల ఇళ్ల నిర్మాణంలో కమిషన్లు దండుకుని ప్రజలను నట్టేట ముంచారని ఆయన ఆరోపించారు. మా పెద్దాయన ప్రెస్ మీట్‌పై రాచమల్లు హేళనగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జబీవుల్ల తెలిపారు.

రాజా ఫౌండేషన్ అధినేత హత్య, నందం సుబ్బయ్య హత్య కేసు వంటి అంశాలను కూడా జబీవుల్ల ప్రస్తావించారు. ఈ కేసుల్లో అధికార బలంతోనే పేర్లు తప్పించుకున్నారని రాచమల్లు పై ఆరోపించారు. రాజా ఫౌండేషన్ హత్యను కప్పిపుచ్చేందుకు రాచమల్లు ప్రయత్నించారని, యాక్సిడెంట్ కేసులో నిందితుడిని చిన్నపిల్లాడు అని చూపించి తప్పించే ప్రయత్నం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు.

కంటికి కనిపించే హత్యలను కూడా గుండెపోటుగా చిత్రీకరించడం వైసీపీ నేతలకే చెల్లిందని జబీవుల్ల విమర్శించారు. హాజరయ్య పోలీస్ అదుపులోకి వెళ్లడంతో రాచమల్లులో భయం మొదలైందని, భూదందాలు బయటపడతాయనే వణుకుతో ఉన్నారని ఆరోపించారు.

“జేఎస్‌డబ్ల్యూ పూర్తయ్యాక అది కూడా మేమే చేశామని ప్రచారం చేసుకుంటారా?”

ఈ ప్రశ్నను లేవనెత్తిన జబీవుల్ల, రేపటి నుండి రాచమల్లు అవినీతి చిట్టాను ఆధారాలతో సహా బయటపెడతామని ప్రకటించారు. ప్రెస్ మీట్‌లు నిర్వహించి ప్రజలకు నిజాలు తెలియజేస్తామని హెచ్చరించారు. జగన్ బాటలోనే నడుస్తూ ప్రొద్దుటూరును అవినీతిమయం చేశారని, ప్రజలు ఈసారి తగిన బుద్ధి చెబుతారని జబీవుల్ల వ్యాఖ్యానించారు.