రాయలసీమ న్యూస్, డిస్ట్రిక్ట్ న్యూస్ డెస్క్: పులివెందుల : అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పులివెందులలో నిర్వహించిన కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యాన్ని పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి ప్రస్తావించారు. మున్సిపల్ కమిషనర్, ఆర్డీవో తదితర అధికారులతో కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీటెక్ రవి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, గ్లోబల్ వార్మింగ్ వంటి అంశాలపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇటీవల అమరావతిలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించిన దిశగా స్థానికంగా చిన్న చిన్న పనుల కోసం తిరిగేటప్పుడు ఎలక్ట్రిక్ సైకిళ్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలా చేయడం వల్ల పర్యావరణానికి మేలు జరగడమే కాకుండా శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని వివరించారు.
డీజిల్ వినియోగం తగ్గడం ద్వారా విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా లాభం చేకూరుతుందని బీటెక్ రవి తెలిపారు. ఈ లక్ష్యంతోనే ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తాను పులివెందుల టీడీపీ కార్యాలయం నుంచి న్యాక్ బిల్డింగ్ సమీపంలోని విపశ్యన అంతర్జాతీయ ధ్యాన కేంద్రం వరకు సైకిల్‌పై వచ్చానని ఆయన చెప్పారు. పార్టీ ఆఫీస్ పనుల నిమిత్తం ఇప్పటికే 10 ఎలక్ట్రిక్ సైకిళ్లను ఆర్డర్ చేసినట్టు వెల్లడించారు. రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో పులివెందులను పూర్తిగా ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా మార్చేందుకు అధికారులతో పాటు ప్రజలందరూ సహకరించాలని బీటెక్ రవి కోరారు. ఈ దిశగా సమగ్ర కార్యాచరణను రూపొందించి అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. గత ముఖ్యమంత్రి హెలిప్యాడ్ కోసం పచ్చని చెట్లను నరికివేయించారని, అయితే ప్రస్తుత ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమాలను బలంగా ముందుకు తీసుకెళ్తోందని బీటెక్ రవి గుర్తుచేశారు. పర్యావరణాన్ని కాపాడుకుంటూ పులివెందులను ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, మున్సిపల్ కమిషనర్, తుంగభద్ర ప్రాజెక్టు హై లెవెల్ కెనాల్ చైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి, అక్కులగారి విజయ్ కుమార్ రెడ్డి, తుమ్మలపల్లె ఎంపీటీసీ విశ్వనాథ రెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ చంద్ర వర్ధన్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి (వెంకీ), పుష్పగిరి స్కూల్ కరస్పాండెంట్ ఓబుల్ రెడ్డి, పులివెందుల టీడీపీ మండల అధ్యక్షుడు మార్తల జగన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.













