రాయలసీమ న్యూస్, తెలంగాణ డెస్క్: ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్లలో ఒకటిగా పేరుగాంచిన వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్న పంటకు సరికొత్త రికార్డు నమోదైంది. మంగళవారం జరిగిన పంట కొనుగోళ్లలో మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొక్కజొన్నకు అత్యధిక ధర లభించింది.
ఓపెన్ మార్కెట్‌లో ప్రైవేటు వ్యాపారులు పరస్పరం పోటీ పడి క్వింటా మొక్కజొన్నకు గరిష్ఠంగా రూ.2,310 చెల్లించి కొనుగోలు చేశారు. సాధారణంగా ఈ కాలంలో లభించే ధరల కంటే ఇది చాలా ఎక్కువ కావడంతో రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని పర్వతగిరి మండలం చింతనెక్కొండ గ్రామానికి చెందిన రైతు మామిండ్ల దేవేందర్‌కు ఈ రికార్డు ధర దక్కింది. ఆయన తనకున్న రెండెకరాల భూమిలో సుమారు రూ.50 వేల పెట్టుబడితో మొక్కజొన్న సాగు చేశారు. వాతావరణం అనుకూలించడంతో పాటు సరైన యాజమాన్య పద్ధతులు పాటించడంతో ఎకరాకు ఆశించిన దానికంటే మెరుగైన దిగుబడి వచ్చింది.
మొత్తం రెండెకరాల నుంచి 72 క్వింటాళ్ల మొక్కజొన్న దిగుబడి సాధించిన దేవేందర్, ఈ పంట సరుకును మంగళవారం ఎనుమాముల మార్కెట్‌కు తీసుకువచ్చారు. అక్కడి ప్రైవేటు వ్యాపారులు సరుకును పరిశీలించి నాణ్యతను దృష్టిలో ఉంచుకుని క్వింటాకు రూ.2,310 చొప్పున మొత్తం పంటను కొనుగోలు చేశారు. పెట్టుబడితో పోలిస్తే రైతు దేవేందర్‌కు ఊహించని రీతిలో భారీ లాభం చేకూరింది.
ప్రభుత్వం ప్రకటించిన మొక్కజొన్న మద్దతు ధర క్వింటాకు రూ.2,400 గా ఉంది. అయితే ప్రభుత్వ సంస్థ అయిన మార్క్‌ఫెడ్ ఏర్పాటు చేసిన అధికారిక కొనుగోలు కేంద్రాల్లో సరుకు సేకరణ ప్రక్రియ తీవ్ర జాప్యంతో సాగుతోంది. టెక్నికల్ సమస్యలు, ఇతర కారణాల వల్ల కొనుగోళ్లు ఆలస్యం అవుతుండటంతో దేవేందర్ ఇప్పటివరకు తన పంటను ఇంట్లోనే నిల్వ ఉంచారు. మార్కెట్లో డిమాండ్ పెరిగే వరకు వేచి చూశారు.
ప్రభుత్వ కేంద్రాల ఆలస్యం కారణంగానే పంటను ఇంట్లో దాచుకోవాల్సి వచ్చిందని, కానీ ఇప్పుడు ఓపెన్ మార్కెట్‌లోనే మద్దతు ధరకు కేవలం 90 రూపాయల తక్కువతో మంచి ధర రావడం చాలా సంతోషంగా ఉందని
అని సదరు రైతు వెల్లడించారు.
ప్రభుత్వ మద్దతు ధర రూ.2,400కు అత్యంత సమీపంగా ప్రైవేటు వ్యాపారులు రూ.2,310 చొప్పున మొక్కజొన్నను కొనుగోలు చేయడం ఇదే తొలిసారి అని ఎనుమాముల మార్కెట్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. సాధారణంగా మార్కెట్ సీజన్ ప్రారంభంలో వ్యాపారులు తక్కువ ధరలకే కొనుగోలు చేస్తుంటారని, అయితే ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, నాణ్యమైన దిగుబడి కారణంగానే ఈ రికార్డు ధర సాధ్యమైందని వారు వివరించారు.
రాబోయే రోజుల్లో మిగిలిన రైతులకు కూడా ఇదే తరహాలో మంచి ధరలు లభించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.







