రాయలసీమ న్యూస్, అనంతపురం:
ఉనికి కోసమే వైకాపా పాకులాట: తెదేపా జిల్లా అధ్యక్షుడు పూలనాగరాజు విమర్శ
అనంతపురం:- రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను ప్రజలు ప్రశంసిస్తున్న వేళ, ఉనికి కోసం వైకాపా నాయకులు పాకులాడుతున్నారని తెదేపా అనంతపురం జిల్లా అధ్యక్షుడు పూలనాగరాజు ఆరోపించారు. అనంతపురం నగరంలోని పార్టీ అర్బన్ కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కూటమి సర్కారు రెండేళ్ల పాలనలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, దీనిని తట్టుకోలేక వైకాపా నాయకులు అసత్య ప్రచారానికి తెగబడుతున్నారని పూలనాగరాజు విమర్శించారు. పార్టీలో కొందరు కార్యకర్తల మానసిక స్థితిని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి వైకాపా ప్రయత్నిస్తోందని, వారిని తెదేపాపై ఉసిగొల్పుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి నీచ సంస్కృతి వైకాపాకే సొంతమని వ్యాఖ్యానించారు.
తెదేపాలో కష్టపడిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు ఉంటుందని, ఎవరు ఎంత కష్టపడితే వారికి అంత ప్రాధాన్యత లభిస్తుందని పూలనాగరాజు స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం దిశగా ప్రతి కార్యకర్త బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఈ నెల 25 నుంచి ఆగస్టు 10 వరకు 45 రోజులపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. రెండేళ్ల పాలనపై ఈ నెల 19న జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆ సమావేశానికి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి టీజీ భరత్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ హాజరుకానున్నారని వివరించారు.
సమావేశంలో తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌చౌదరి, రాష్ట్ర కార్యదర్శులు ఉమర్‌ముక్తార్, సంగా తేజస్విణి తదితర నాయకులు పాల్గొన్నారు.
పార్టీ నియమావళి ఉల్లంఘనపై ముగ్గురు కార్యకర్తలకు తాఖీదులు
అనంత అర్బన్ నియోజకవర్గంలో పార్టీ నియమావళికి విరుద్ధంగా వ్యవహరించిన ముగ్గురు తెదేపా కార్యకర్తలకు తాఖీదులు జారీ చేసినట్లు జిల్లా అధ్యక్షుడు పూలనాగరాజు తెలిపారు. శ్రీనివాస చౌదరి, సయ్యద్ సైఫుద్దీన్, మహబూబ్‌బాష పార్టీ కార్యకర్తలుగా ఉంటూ పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించినట్లు ఆయన పేర్కొన్నారు.
బహిరంగ వేదికలపై, పత్రికల ద్వారా, సామాజిక మాధ్యమాల వేదికగా పార్టీకి వ్యతిరేకంగా ఆరోపణలు చేసినట్టు పూలనాగరాజు వివరించారు. పార్టీకి సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే వాటిని బహిరంగంగా ఆరోపణల రూపంలో కాకుండా జిల్లా నాయకుల దృష్టికి తీసుకురావాల్సిందిగా సూచించారు.
తాఖీదులు అందుకున్న నాటి నుంచి ఎనిమిది రోజుల్లోగా ముగ్గురు కార్యకర్తలు తమ వివరణను సమర్పించాలని ఆదేశించినట్లు తెలిపారు. పార్టీ నియమావళిని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో ఎలాంటి సందేహం ఉండదని, ఇందుకు పార్టీ కట్టుబడి ఉందని పూలనాగరాజు స్పష్టం చేశారు.













