రాయలసీమ న్యూస్, అనంతపురం:
యువ పథం.. పరిశోధనలకు పట్టం
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని భాగ్యనగర్‌కు చెందిన యువ శాస్త్రవేత్త డాక్టర్ బి. శశిధర్ తన పరిశోధనలతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నారు. తిరువనంతపురంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటెర్డిస్సాసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న ఆయనకు ఇటీవల ప్రతిష్ఠాత్మక చిరంతన్ రసాయన్ సంస్థ రజత పతకం లభించింది.
రసాయనశాస్త్రంలో డాక్టర్ శశిధర్ చేసిన వినూత్న పరిశోధనలను గుర్తిస్తూ గుజరాత్‌లోని రాజ్‌కోట్ సౌరాష్ట్ర విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ పతకాన్ని అందజేశారు. జీవ క్రియాశీల చిన్న అణువుల రూపకల్పన, పర్యావరణ హిత మెటల్ రహిత సంశ్లేషణ అభివృద్ధి, సహజ ఉత్పత్తుల ఆధారిత ఔషధ పరిశోధనల రంగాల్లో ఆయన ప్రత్యేకత చాటుకున్నారు.
ప్రత్యేకంగా జీవక్రియ సంబంధిత వ్యాధులు, సూక్ష్మజీవుల వల్ల కలిగే అంటు రోగాలు, నాడీ క్షీణత సమస్యల చికిత్సకు ఉపయోగపడే కొత్త ఔషధాల అభివృద్ధిపై డాక్టర్ శశిధర్ పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన రూపొందిస్తున్న సంయోగాలు, పద్ధతులు భవిష్యత్తులో వైద్య రంగానికి ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తల వర్గాలు భావిస్తున్నాయి.
దేశానికి గౌరవం తీసుకురావడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండే, ప్రయోజనకరమైన ఔషధాలను ఆవిష్కరించాలనే లక్ష్యంతో డాక్టర్ శశిధర్ తన పరిశోధనలను ముందుకు తీసుకెళ్తున్నారు. గుంతకల్లు వంటి పట్టణం నుంచి ఎదిగిన శాస్త్రవేత్తగా ఆయన సాధించిన ఈ విజయంపై కుటుంబ సభ్యులు, స్నేహితులు, గురువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
దేశం గర్వపడేలా, ప్రజలకు ఉపయోగపడే ఔషధాలు ఆవిష్కరించాలన్నదే ధ్యేయం. అందుకోసం పరిశోధనలు చేస్తున్నా. గుంతకల్లు నుంచి పేరొందిన శాస్త్రవేత్త ఉన్నాడని దేశం గర్వపడేలా చేస్తా.
డాక్టర్ శశిధర్ సాధించిన ఈ గుర్తింపు యువతకు స్ఫూర్తిదాయకమని స్థానికులు పేర్కొంటున్నారు. చిన్న పట్టణాల నుంచి వచ్చిన విద్యార్థులు కూడా కృషి, పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరనే నమ్మకాన్ని ఆయన విజయాలు నూరిపోస్తున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు.
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారతీయ శాస్త్రవేత్తల ప్రతిభను ప్రపంచానికి చాటడంలో డాక్టర్ శశిధర్ వంటి పరిశోధకుల పాత్ర కీలకమని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పురస్కారాలు అందుకుని గుంతకల్లు, అనంతపురం జిల్లాకు, ఆంధ్రప్రదేశ్‌కు డాక్టర్ శశిధర్ మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని స్థానిక ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.













