ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించేందుకు అధికారిక షెడ్యూల్ విడుదలైంది. మున్సిపాలిటీలు, ZPTC, MPTC స్థానాలతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికలను విడతల వారీగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. నవంబర్ 1వ తేదీ నుండి కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించనున్నాయి.

రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిఫరెన్స్ షెడ్యూల్‌ను ప్రభుత్వం ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మూడు విడతలుగా పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియలు పూర్తిచేసి, నవంబర్ ప్రారంభానికి ముందే స్థానిక సంస్థల కొత్త ప్రతినిధులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

మొదటి విడత: మున్సిపల్ ఎన్నికలు

స్థానిక సంస్థల ఎన్నికల తొలి విడతగా మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 7న మున్సిపాలిటీలకు సంబంధించిన అధికారిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అనంతరం సెప్టెంబర్ 20వ తేదీన పోలింగ్ నిర్వహించి, సెప్టెంబర్ 23వ తేదీన ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలను ప్రకటించనున్నారు.

రెండో విడత: ZPTC, MPTC ఎన్నికలు

ద్వితీయ విడతలో భాగంగా ZPTC, MPTC ఎన్నికల నోటిఫికేషన్ సెప్టెంబర్ 28న వెలువడుతుంది. ఈ ఎన్నికలకు అక్టోబర్ 11వ తేదీన ఓటింగ్ జరగనుంది. అక్టోబర్ 14వ తేదీన ఓట్ల లెక్కింపు పూర్తిచేసి, అదే రోజు ఫలితాలను ప్రకటించేలా షెడ్యూల్‌లో ప్రస్తావించారు.

మూడో విడత: గ్రామ పంచాయతీ ఎన్నికలు

చివరి విడతగా గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ 19న నోటిఫికేషన్‌తో ప్రారంభమవుతుంది. అక్టోబర్ 28వ తేదీన ఒకే రోజున గ్రామ పంచాయతీలకు పోలింగ్ నిర్వహించి, ఓట్ల లెక్కింపు కూడా అదే రోజున పూర్తిచేసి ఫలితాలను విడుదల చేయనున్నట్లు షెడ్యూల్‌లో పేర్కొన్నారు.

మొత్తం మూడు విడతల ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం, నవంబర్ 1వ తేదీ నుండి కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రతినిధులు అధికారిక విధులు, కార్యచరణలను ప్రారంభించనున్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలందరూ చైతన్యంతో ఓటు హక్కును వినియోగించుకుని స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని అధికారులు ప్రజలను కోరుతున్నట్లు షెడ్యూల్ వివరాల్లో వెల్లడైంది.