రాజకీయ సన్యాసం ప్రకటించి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి మళ్లీ రాజకీయ రంగంలోకి అడుగుపెడుతున్నారు. తిరుమలలో శ్రీవారి సాక్షిగా సరికొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ నెలలోనే విజయవాడలో పార్టీ పేరు, జెండా, విధివిధానాల రోడ్‌మ్యాప్‌ను వెల్లడించనున్నట్టు తెలిపారు.

వైఎస్సార్‌సీపీలో నంబర్ టూ స్థాయిలో కీలక పాత్ర పోషించిన విజయసాయిరెడ్డి, దేశవ్యాప్తంగా ఆడిటింగ్ నిపుణుడిగా పేరుపొందారు. ఇలాంటి వ్యక్తి కేవలం ప్రజాసేవ కోసం కొత్త పార్టీ పెట్టుతున్నారనే మాటను రాజకీయ వర్గాలు సీరియస్‌గా తీసుకోవడం లేదు. రాజకీయాల్లో సొంత పార్టీ నడపడం అంటే భారీ ఆర్థిక వ్యయం. అయినా ఆయన ఈ అడుగు వేస్తుండటంతో, ఈ పెట్టుబడి వెనుక మరింత పెద్ద ప్రయోజనాలు, సరికొత్త లెక్కలు దాగి ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ కొత్త రాజకీయ ప్రయోగం వెనుక ప్రధానంగా వినిపిస్తున్న వాదన వ్యక్తిగత, వ్యాపార రక్షణ కవచం. గత ఐదేళ్లలో విశాఖపట్నం భూముల వ్యవహారాలు, దసపల్లా భూ వివాదాలు, లిక్కర్ లావాదేవీలు, అనేక ఆస్తుల క్రయవిక్రయాలపై విజయసాయిరెడ్డి పేరు చుట్టూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో పాత ఫైళ్లను తిరగదోడే అవకాశం, మరోవైపు సీబీఐ, ఈడీ అక్రమాస్తుల కేసుల విచారణలు కొనసాగుతుండటంతో, సాధారణ పౌరుడిగా ఉంటే చట్టపరమైన ఉచ్చు బిగుస్తుందన్న భయం ఆయనను వెంటాడుతోందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

భవిష్యత్తులో ఏ విచారణ సంస్థ దర్యాప్తు చేపట్టినా, రాజకీయ కక్షసాధింపు, కొత్త పార్టీ పెట్టినందుకే వేధింపుల ముద్ర వేసి ప్రజల్లో సానుభూతి పొందేందుకు పార్టీ హోదాను రక్షణ కవచంగా వినియోగించుకోవాలన్నదే ఆయన మొదటి వ్యూహం కావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇంకో బలమైన కోణం బీజేపీ పెద్దల గేమ్ ప్లాన్. ఢిల్లీలో కమలనాథులతో విజయసాయిరెడ్డికి ఉన్న సంబంధాలు రాజకీయ వర్గాలకు తెలిసిందే. ఏపీలో కూటమి బలంగా ఉన్న ఈ సమయంలో నేరుగా బీజేపీలో చేరడానికి సాంకేతిక, రాజకీయ ఇబ్బందులు ఉన్నాయని విశ్లేషకుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు లేదా అసంతృప్తి ఓట్లు వైఎస్సార్‌సీపీకి మళ్లీ చేరకుండా అడ్డుకునే ప్రత్యేక సాధనంగా ఈ కొత్త పార్టీని రంగంలోకి దింపుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తటస్థ వేదికలా కనిపిస్తూ, తెరవెనుక ఢిల్లీ పెద్దల ప్రయోజనాలకు అనుగుణంగా పావులు కదిలించే ప్రయత్నంగా ఈ పార్టీని చూడాలని కొందరు భావిస్తున్నారు.

మూడో కోణం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మైండ్ గేమ్. వైఎస్సార్‌సీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రాబల్యం పెరిగిన తర్వాత తనను పక్కన పెట్టారని భావిస్తున్న విజయసాయిరెడ్డి, తాడేపల్లి ప్యాలెస్‌కు చెక్ పెట్టాలని చూస్తున్నారనే చర్చ ఉంది. వైఎస్ కుటుంబానికి నమ్మకస్తుడైన ఆడిటర్‌గా పార్టీలోని నాయకుల ఆర్థిక మూలాలు, అంతర్గత బలహీనతలు, క్షేత్రస్థాయి నెట్‌వర్క్‌పై ఆయనకు ఉన్న అవగాహన కొత్త పార్టీకి ఆయుధంగా మారవచ్చని పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. అసంతృప్త నేతలు, ద్వితీయ శ్రేణి కేడర్‌ను తనవైపు తిప్పుకుని జగన్ ఓటు బ్యాంకును చీల్చగలనని బ్లాక్‌మెయిల్ చేసే ఎత్తుగడ కూడా ఇందులో దాగి ఉందని వారు భావిస్తున్నారు.

ఒక ప్రాంతీయ పార్టీని స్థాపించి క్షేత్రస్థాయిలో నిలబెట్టడం సులభం కాదు. కేవలం మీడియా దృష్టి కోసం, లేదా బేరసారాల కోసం ఏర్పడి కాలగర్భంలో కలిసిపోయిన పార్టీల చరిత్ర ఏపీలో చాలానే ఉంది. విజయసాయిరెడ్డి వేస్తున్న ఈ పాచికల వెనుక అసలు లక్ష్యం కేసుల నుంచి ఆత్మరక్షణకో, బీజేపీ రాజకీయ ప్రయోగానికో, లేక జగన్‌పై ప్రతీకారానికో అన్నది ఆయన పార్టీ అధికారిక ప్రకటన చేసి మొదటి అడుగు వేసిన తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది.