రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్:
దేవాన్ష్ పేరుతో ఘాట్ వివాదం:
ఇది హాస్యాస్పదం.. తొలగించండి : – మంత్రి నారా లోకేష్ ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్‌లో 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేపడుతోంది. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలిలో ఏర్పాటు చేస్తున్న ఓ పుష్కర ఘాట్‌కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు దేవాన్ష్ పేరు పెట్టడం వివాదానికి దారితీసింది. ఆ ఘాట్‌పై ఉన్న బోర్డు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తారు.
మునికూడలిలో గోదావరి పుష్కరాల కోసం ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. అక్కడి ఘాట్‌కు దేవాన్ష్ పేరు పెట్టిన విషయాన్ని జిల్లా అధికారులు స్థానికంగా ప్రకటించారు. ఆ ఘాట్‌ను కలెక్టర్ కీర్తి చేకూరి ప్రత్యక్షంగా పరిశీలించారు. దేవాన్ష్ పేరుతో ఉన్న ఆ ఘాట్‌ను మోడల్ గ్రామీణ పుష్కర ఘాట్‌గా అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు ఆమె అధికారులకు సూచనలు ఇచ్చారు.
ఈ నెల 24న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు ముందే ఆ ఘాట్ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చే భక్తులకు ఈ దేవాన్ష్ ఘాట్ ప్రధాన కేంద్రంగా ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ప్రస్తుతం 49 మీటర్ల పొడవు ఉన్న ఈ ఘాట్‌ను 84 మీటర్లకు విస్తరించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వరదలు రాకముందే అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గోదావరి హారతి, ఇతర ధార్మిక కార్యక్రమాల కోసం 5 మీటర్ల వెడల్పుతో ప్రత్యేక ఘాట్ నిర్మించాలనే ప్రతిపాదనను కూడా ముందుకు తెచ్చారు.
ఘాట్ పరిసరాల్లో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, దుస్తులు మార్చుకునే గదులు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ స్థలాలు, అన్నాద కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. అలాగే ముందస్తు జాగ్రత్త చర్యల భాగంగా రెండు ఫైరింజన్లు, రెండు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కూడా ఆమె ఆదేశించారు.
మునికూడలిలోని ఘాట్‌ను కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేలు పరిశీలించిన తర్వాత దేవాన్ష్ పేరుతో ఉన్న బోర్డు బయటకు రావడంతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చ మొదలైంది. గోదావరి పుష్కరాల ఘాట్‌కు దేవాన్ష్ పేరు పెట్టడం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదం తాజాగా మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్లింది.
సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం, ఫోటోలు తన దృష్టికి చేరిన వెంటనే నారా లోకేష్ స్పందించారు. దేవాన్ష్ పేరుతో ఘాట్ ఏర్పాటు చేయడం చాలా హాస్యాస్పదంగా ఉందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఏ ఘాట్‌కైనా దేవాన్ష్ పేరు పెట్టకూడదని సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చిన వారికి మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన దేవాన్ష్ ఘాట్ బోర్డు ఫోటోలు, వీడియోలపై ప్రభుత్వం స్పందించడంతో ఇప్పుడు ఆ ఘాట్ పేరు మార్పు దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.







