రాయలసీమ న్యూస్, ఆంధ్రప్రదేశ్ డెస్క్:
రాజధాని అమరావతి మీదుగానే హైదరాబాద్–చెన్నై బుల్లెట్ రైలు కారిడార్
హైదరాబాద్–అమరావతి–చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ మార్గం రాజధాని అమరావతి మీదుగానే కొనసాగనుంది. అమరావతి సమీపంలోని రావెల వద్ద ప్రతిపాదించిన అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆనుకొని కారిడార్ ఎలైన్‌మెంట్ ఉండాలన్న సూచనను కొంతకాలం క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ దిశగా నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్) ఫైనల్ లొకేషన్ సర్వే, డీపీఆర్ సిద్ధం చేసేందుకు ముందడుగు వేసింది.
అయితే విమానాశ్రయానికి దగ్గరగా ఎలైన్‌మెంట్ ఖరారు చేస్తే కారిడార్ రాజధాని నగరం, విజయవాడలకు దూరమవుతుందని అధికారులు గుర్తించారు. విమానాశ్రయం సమీపం నుంచి గుంటూరు వైపు మళ్లాల్సి వస్తుందని అంచనా వేశారు. దీంతో రాజధాని అమరావతికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో, మొదట ప్రతిపాదించినట్లుగానే అమరావతి మీదుగా కారిడార్ వెళ్లేలా ఫైనల్ లొకేషన్ సర్వే, డీపీఆర్ రూపొందించాలని తాజాగా సూచనలు జారీ చేసింది.
హైదరాబాద్–అమరావతి–చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ మొత్తం పొడవు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో కలిపి 760.09 కిలోమీటర్లు. ఇందులో 18 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ పరిధిలో 180.32 కిలోమీటర్ల మేర కారిడార్ ఉండగా, హైదరాబాద్, శంషాబాద్, భారత్ సిటీ, డ్రైపోర్ట్, హాలియా, వాడపల్లి వద్ద స్టేషన్లు ప్రతిపాదించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఈ కారిడార్ 518.54 కిలోమీటర్ల మేర సాగనుంది. రాష్ట్రంలో దాచేపల్లి మొదటి స్టేషన్‌గా ఉంటుంది. అనంతరం అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, తిరుపతి (విమానాశ్రయం వద్ద) స్టేషన్లు నిర్మించనున్నారు. తమిళనాడులో 61.23 కిలోమీటర్ల మేర కారిడార్ ఉండగా, తిరువళ్లూరు, చెన్నై ఔటర్ రింగ్ రోడ్/మింజూర్, చెన్నై సెంట్రల్ స్టేషన్లు ప్రతిపాదించారు.
ఇక చెన్నై–బెంగళూరు హైస్పీడ్ రైల్ కారిడార్ మొత్తం 306 కిలోమీటర్లు. ఇందులో తమిళనాడులో 133 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్‌లో 72 కిలోమీటర్లు, కర్ణాటకలో 101 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. చెన్నై సెంట్రల్, పూనమల్లె, పరందూరు (తమిళనాడు), చిత్తూరు (ఆంధ్రప్రదేశ్), కోలార్, కొడిహళ్లి, వైట్‌ఫీల్డ్, బయప్పనహళ్లి (కర్ణాటక) కలిపి మొత్తం ఏడు స్టేషన్లు ఉంటాయి.
ఈ కారిడార్‌లో నాలుగు సొరంగాలు ప్రతిపాదించారు. చెన్నై నగర పరిధిలో సెంట్రల్ స్టేషన్ వద్ద 1.73 కిలోమీటర్ల సొరంగ మార్గం, బెంగళూరులో రెండు చోట్ల కలిపి 14.79 కిలోమీటర్ల సొరంగాలు నిర్మించనున్నారు. మధ్యలో చిత్తూరు జిల్లాలోని కౌండిన్య వన్యప్రాణి అభయారణ్యం మీదుగా కారిడార్ వెళ్లే భాగంలో, పలమనేరు సమీప అటవీ ప్రాంతంలో 11.8 కిలోమీటర్ల సొరంగం నిర్మించి దానిలోంచే రైలు మార్గాన్ని తీసుకెళ్లాలని ప్రణాళిక ఉంది.
హైదరాబాద్–అమరావతి–చెన్నై కారిడార్ తిరుపతి విమానాశ్రయం మీదుగా, చెన్నై–బెంగళూరు కారిడార్ చిత్తూరు మీదుగా వెళ్లనుండటంతో ఈ రెండు మార్గాలను అనుసంధానించేలా తిరుపతి–చిత్తూరు మధ్య ప్రత్యేక హైస్పీడ్ లింక్ కారిడార్ నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో సూచించారు. దీనిని పరిగణలోకి తీసుకున్న ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్ అధికారులు ఈ అనుసంధాన కారిడార్‌కు సంబంధించిన ఫైనల్ లొకేషన్ సర్వే, డీపీఆర్ తయారీపై దృష్టి సారించారు.
ఇక హైదరాబాద్–బెంగళూరు హైస్పీడ్ రైల్ కారిడార్ మొత్తం 597 కిలోమీటర్లు. ఇందులో తెలంగాణలో 239 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్‌లో 264 కిలోమీటర్లు, కర్ణాటకలో 94 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఈ మార్గంలో మొత్తం 15 స్టేషన్లు ఉంటాయి. తెలంగాణలో హైదరాబాద్, శంషాబాద్, భారత్ సిటీ, ఆమనగల్లు, మన్ననూర్/పెన్మిల, సోమశిల, ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు, డోన్, గుత్తి, అనంతపురం, దుద్దేబండ, హిందూపురం, కర్ణాటకలో అలిపురా, దేవనహళ్లి, కొడిహళ్లి స్టేషన్లు ప్రతిపాదించారు.







