ఐదు నెలల్లోనే లక్షకు పైగా టెక్ ఉద్యోగాలు కోల్పోయారు

హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను ఆందోళనకు గురిచేసే గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. 2026 జనవరి నుంచి మే వరకు ఐదు నెలల వ్యవధిలోనే 164 టెక్ కంపెనీలు కలిపి మొత్తం 1,16,739 మంది ఉద్యోగులను లేఆఫ్స్‌ ద్వారా తొలగించినట్లు Layoffs.fyi వెబ్‌సైట్ వెల్లడించింది.

ఈ వివరాలను ఇండియన్ టెక్ & ఇన్ఫ్రా అనే ఎక్స్‌ (పూర్వం ట్విట్టర్ ) హ్యాండిల్ తమ పోస్ట్‌లో ప్రస్తావించింది. 2026లో ఐదు నెలల్లోనే 1,16,739 మంది టెక్ ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారని ఆ పోస్ట్‌లో పేర్కొంది. ఇందులో ముఖ్యంగా భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు పాల్పడిన కంపెనీల జాబితాను కూడా వెల్లడించింది.

వీటిలో మెటా అత్యధికంగా 8,000 మందిని తొలగించింది. పేపాల్ 4,760, సిస్కో 4,000, Intuit 3,000, క్లౌడ్ ఫ్లేర్ 1,100, Wix 1,000, LinkedIn 875, బిల్ కం 709, ఫ్రెష్ వర్క్స్ 500, గిట్లబ్ 350, టికెట్ మాస్టర్ 350 మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు ఆ గణాంకాల్లో ఉంది. కొన్ని కంపెనీలు వేలల్లో, మరికొన్ని వందల్లో ఉద్యోగాలను తగ్గించుకున్నాయి.

ఐటీ రంగంలో కొనసాగుతున్న ఈ సైలెంట్ లేఆఫ్స్‌కు ప్రధాన కారణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరగడమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం అనేక కంపెనీలు తమ కార్యకలాపాల్లో ఏఐ టూల్స్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి. మానవ వనరులు అవసరమైన అనేక పనులను ఇప్పుడు ఆటోమేషన్, ఏఐ ఆధారిత వ్యవస్థలు నిర్వహిస్తున్నాయి.

దీంతో కంపెనీలు ప్రొడక్షన్ ఖర్చులను తగ్గించుకోవడం, జీతాల భారం తగ్గించుకోవడం లక్ష్యంగా ఉద్యోగులను తగ్గిస్తున్నాయని నిపుణుల అభిప్రాయం. ముఖ్యంగా బెంచ్‌పై ఉన్న ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని, వారిపై ఒత్తిడి తీసుకువచ్చి రాజీనామాలు చేయిస్తున్నట్లు రంగం వర్గాలు చెబుతున్నాయి.

ఏఐ వినియోగం రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉన్నందున, ఐటీ రంగంలో సాంప్రదాయ ఉద్యోగాలపై ఒత్తిడి కొనసాగుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఐటీ రంగంలో నిలదొక్కుకోవాలంటే ఉద్యోగులు తమ నైపుణ్యాలను నిరంతరం అప్‌డేట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రత్యేకంగా ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ , రోబోటిక్స్ , మెషిన్ లెర్నింగ్ , డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక కోర్సులు, టెక్నాలజీల్లో నైపుణ్యం సాధించిన వారికి భవిష్యత్తులో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. మారుతున్న టెక్ ప్రపంచానికి అనుగుణంగా స్కిల్స్‌ను పెంచుకోవడం ద్వారానే ఉద్యోగ భద్రత సాధ్యమని ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.