రాయలసీమ న్యూస్, ఆంధ్రప్రదేశ్ డెస్క్:
సైకిల్ యాత్రకు టీడీపీ శ్రీకారం :
కార్యకర్తలంతా పాల్గొనాలని పల్లా పిలుపు
అమరావతి : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం మహత్తర కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టనుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడానికి రాష్ట్రవ్యాప్తంగా సైకిల్ యాత్రను నిర్వహించేందుకు పార్టీ నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు.
గురువారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన పల్లా శ్రీనివాసరావు, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశాన్ని సమాజానికి చాటిచెప్పేందుకు ఈ సైకిల్ యాత్రను చేపడుతున్నట్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రేపు బాధ్యతగా సైకిల్ వినియోగం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
విశాఖపట్నంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా సైకిల్ ప్రయాణం చేయనున్నారని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ప్రపంచం నేడు వాతావరణ మార్పులు, పెరుగుతున్న కాలుష్యం, తగ్గుతున్న పచ్చదనం వంటి తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోందని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా మారిందని ఆయన అన్నారు.
సైకిల్ వినియోగం వల్ల కాలుష్యం తగ్గడమే కాకుండా, ఇంధన వినియోగం తగ్గి, ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని పల్లా శ్రీనివాసరావు వివరించారు. చిన్న చిన్న ప్రయత్నాలే పెద్ద మార్పులకు నాంది పలుకుతాయని, అలాంటి ప్రయత్నాల్లో భాగంగా ఈ సైకిల్ యాత్రను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.
‘నా దేశం నా బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ ఇంధన వినియోగాన్ని తగ్గించే దిశగా ముందడుగు వేయాలని పల్లా శ్రీనివాసరావు సూచించారు. ఇంధన సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి పార్టీ మహానాడును హైబ్రిడ్ విధానంలో నిర్వహించామని, అది గ్రాండ్ సక్సెస్‌గా నిలిచిందని ఆయన తెలిపారు.
ప్రజలందరూ సైకిల్ యాత్రలో భాగస్వాములై పర్యావరణ పరిరక్షణకు తమ వంతు పాత్ర పోషించాలని పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ‘నేను సైతం’ అనే భావంతో ముందుకు వచ్చి, సైకిల్ వినియోగాన్ని అలవాటు చేసుకోవాలని ఆయన కోరారు.







