పరవాడ కెమికల్‌ కర్మాగారంలో అగ్ని ప్రమాదం .. ఇద్దరు కార్మికులు మృతి

అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో మంగళవారం ఉదయం జరిగిన భారీ అగ్నిప్రమాదం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. ఫార్మాసిటీలోని దక్షిణ ఎనర్జీ కెమికల్‌ కర్మాగారంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. ఈ ఘటనలో అక్కడే పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యారు. మరో ఇద్దరు కార్మికులు గాయపడ్డారని, వారు కూడా మంటల్లో చిక్కుకున్నట్టు ప్రాథమిక సమాచారం వెల్లడించింది.

మృతులిద్దరిని అచ్యుతాపురం ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. గాయపడిన కార్మికులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్నిప్రమాదం కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కర్మాగారంలో ఏ భాగంలోనుంచి మంటలు ప్రారంభమయ్యాయి, ప్రమాద సమయంలో ఎంతమంది కార్మికులు విధుల్లో ఉన్నారు వంటి వివరాలు తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే ఫార్మాసిటీలోని అగ్నిమాపక కేంద్రం నుంచి రెండు అగ్నిమాపక వాహనాలు, పరవాడ నుంచి మరో అగ్నిమాపక వాహనం సంఘటనా స్థలికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగించారు. భారీ మంటలతో కర్మాగారం పరిసర ప్రాంతంలో దట్టమైన పొగ కమ్ముకుంది. స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

పరవాడ ఫార్మాసిటీలో జరిగిన ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు కార్మికుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. జిల్లా అధికారులతో టెలిఫోన్ ద్వారా మాట్లాడి ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక వాహనాలు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చిన విధానంపై అధికారులు సీఎంకు నివేదించారు.

ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని, వారికి అవసరమైన సహాయ చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఆరా తీసిన హోం మంత్రి అనిత..

ఈ ఘటనపై హోం మంత్రి అనిత కూడా స్పందించారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడి అగ్నిప్రమాదం వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు తక్షణం సముచిత వైద్యం అందేలా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఫార్మాసిటీలో భద్రతా ప్రమాణాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

పరవాడ ఫార్మాసిటీలో తరచూ జరుగుతున్న అగ్నిప్రమాదాల నేపథ్యంలో భద్రతా చర్యలపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పరిశ్రమల్లో భద్రతా నిబంధనల అమలు, అత్యవసర పరిస్థితుల్లో స్పందన వ్యవస్థలపై సంబంధిత శాఖలు సమగ్ర సమీక్ష చేపట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.