తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ, కోతల నివారణ చర్యల్లో భాగంగా కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టు పనుల్లో మరింత వేగం తీసుకురావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ ఏడాది నిర్దేశిత లక్ష్యాలను వాతావరణ అనుకూలతలను దృష్టిలో పెట్టుకుని వచ్చే రెండు నెలల్లో పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

గ్రేట్ గ్రీన్ వాల్ లక్ష్య సాధనలో భాగంగా గత రెండేళ్లలో సాధించిన పురోగతికి జాతీయ స్థాయి గుర్తింపు లభించిన విషయాన్ని ఉప ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ముఖ్యంగా మడ అడవుల విస్తరణలో ఆంధ్రప్రదేశ్ దేశంలో ద్వితీయ స్థానం సాధించిందని, ఈ విజయానికి కృషి చేసిన అటవీ శాఖ అధికారులకు, సిబ్బందికి అభినందనలు తెలియజేశారు.

సోమవారం మధ్యాహ్నం గ్రేట్ గ్రీన్ వాల్ పనుల పురోగతిపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. డివిజన్ల వారీగా నిర్దేశించిన లక్ష్యాల అమలు స్థితి, ఇప్పటి వరకు నాటిన మొక్కల సంఖ్య, ఈ ఏడాది మడ అడవుల పెంపకం కోసం లక్ష్యంగా పెట్టుకున్న విస్తీర్ణం తదితర అంశాలపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

వీబీ జీ రాం జీ పథకంలో భాగంగా తీర ప్రాంత జిల్లాలకు అదనంగా మరో 70 లక్షల మొక్కలు కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ మొక్కలు గ్రేట్ గ్రీన్ వాల్ లక్ష్య సాధనకు అదనపు బలం కానున్నాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 8,888 హెక్టార్లలో గ్రీన్ వాల్ విస్తరణకు ఇప్పటికే కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైందని అధికారులు సమావేశంలో వివరించారు.

“వాతావరణ మార్పుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు తలెత్తాయి. ప్రస్తుతం తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న తీర ప్రాంత జిల్లాలకు విపత్తుల ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి అసాధారణ వాతావరణ పరిస్థితుల నుంచి మన తీరాన్ని రక్షించుకోవడంలో గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కీలక భూమిక పోషించనుంది. అందుకే కూటమి ప్రభుత్వం గ్రేట్ గ్రీన్ వాల్‌ను ప్రతిష్ఠాత్మకంగా ముందుకు తీసుకువెళ్తోంది. రాష్ట్రంలో విస్తరించి ఉన్న 1,053 కి.మీ. తీర ప్రాంతం వెంబడి 5 కిలోమీటర్ల వెడల్పున పచ్చదనంతో కూడిన గోడను ఏర్పాటు చేస్తున్నాం. అందులో ఈ ఏడాది 8,888 హెక్టార్లలో గ్రీన్ వాల్ విస్తరణకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశాం. మొదటి అర్ధభాగంలో వాతావరణ అనుకూలతల ఆధారంగా కొంత మేర మొక్కలు నాటే ప్రక్రియ పూర్తయ్యింది. ద్వితీయార్థంలో తాటి విత్తనాలు అందుబాటులోకి రానున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వీటి సేకరణ, నాటే ప్రక్రియను పూర్తి చేయాలి. దాదాపు 5,000 హెక్టార్లలో తాటి వనాల ఏర్పాటును ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకున్నాం. కాలువ గట్లు, చెరువులు, తీర ప్రాంతాల్లో తాటి చెట్లు గాలి నిరోధక వ్యవస్థగా నిలుస్తాయి. తాటివనాలు, సామాజికవనాల ఏర్పాటు పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలి.”

“కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గడచిన రెండేళ్లలో మడ అడవుల పెంపకంలో చక్కటి పురోగతి సాధించాం. 2024–25 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 740 హెక్టార్లు, 2025–26లో 1,930 హెక్టార్ల మేర మడ అడవుల విస్తరణ చేపట్టాం. తద్వారా మడ ఫారెస్టింగ్‌లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచాం. ఈ అద్భుత ఘనత సాధనకు కృషి చేసిన సిబ్బందికి, సహాయ సహకారాలు అందించిన పర్యావరణ నిపుణులకు హృదయపూర్వక అభినందనలు. సాధారణంగా మడ అడవుల స్థాపనకు అక్టోబర్ నుంచి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఈ ఏడాది మరింత బాధ్యతాయుతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలి. నవంబర్, డిసెంబర్ మాసాల్లో MISHTI-II కింద 305 హెక్టార్లలో మడ అడవుల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించాం. తీర ప్రాంత రక్షణ కవచం అయిన మడ అడవుల ప్రాధాన్యతను గ్రహించి, నిర్ణీత సమయంలో విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేయాలి.”

తాటి వనాలు, సామాజిక వనాల ఏర్పాటులో ప్రజా భాగస్వామ్యాన్ని పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. తీర ప్రాంత రక్షణ, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంలో గ్రేట్ గ్రీన్ వాల్, మడ అడవుల విస్తరణ కీలక పాత్ర పోషించనున్నాయని ఆయన సమావేశంలో స్పష్టం చేశారు.