స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్

విశాఖపట్నం : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్మికులను ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళవారం ఉదయం విశాఖ కిమ్స్ ఆస్పత్రిలో పరామర్శించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు చికిత్స పొందుతున్న వార్డులను సందర్శించిన పవన్ కల్యాణ్, ఒక్కొక్కరి ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుంచి తెలుసుకున్నారు.

ప్రమాదం ఎలా జరిగిందో, ఘటన సమయంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో బాధితులను, వారి కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గాయాల తీవ్రత, ఇప్పటివరకు అందించిన చికిత్స, అవసరమైన తదుపరి వైద్య సేవలపై ఆస్పత్రి వైద్యులతో చర్చించారు.

వైద్యానికి అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని, బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని పవన్ కల్యాణ్ బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రమాదంతో కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కూడా ఆయన ఆరా తీశారు.

మెరుగైన వైద్య సేవలు అందించండి..

కిమ్స్ ఆస్పత్రి నిర్వహణ, వైద్య బృందం నుంచి చికిత్స విధానం, అవసరమైన సౌకర్యాలపై పవన్ కల్యాణ్ సమాచారం తీసుకున్నారు. అవసరమైతే అదనపు వైద్య సిబ్బంది, సదుపాయాలను కూడా సమకూర్చేలా అధికారులను ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

ఉపముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కూడా ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ప్రమాదం అనంతరం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, సహాయక కార్యక్రమాలపై వారు సమీక్ష నిర్వహించినట్లు సమాచారం.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రమాదానికి గల కారణాలు, భద్రతా ప్రమాణాల అమలులో ఎలాంటి లోపాలు ఉన్నాయో గుర్తించేందుకు సంబంధిత శాఖలు పరిశీలిస్తున్నాయి. బాధితులకు తగిన నష్టపరిహారం, ఉద్యోగ భద్రత వంటి అంశాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై రాష్ట్రంలోని వివిధ రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు. స్టీల్ ప్లాంట్‌లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని, కార్మికుల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

త్రిసభ్య కమిటీ దర్యాప్తు : పవన్

విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనాస్థలిని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు చేస్తుందని తెలిపారు. ప్రమాదానికి ముందే.. మరో ఘటన జరిగిందని కార్మికులు చెప్పారన్నారు. ఇలాంటి ఘటన గత 33 ఏళ్లలో ఎప్పుడూ జరగలేదన్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విశాఖ ఉక్కు ప్రైవేట్‌పరం కాకూడదన్నదే తమ ఆకాంక్ష అని చెప్పుకొచ్చారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నిరంతర నిఘా ఉండాలన్నారు. విచారణ కమిటీ నివేదిక వచ్చాక చర్యలు తీసుకోనున్నట్లు ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ పేర్కొన్నారు.