పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ పల్లె నుంచి పట్టణం వరకు రహదారి నిర్మాణ ప్రణాళికలను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. నియోజకవర్గవ్యాప్తంగా కేవలం రహదారి నిర్మాణానికే రూ. 200 కోట్లకు పైగా నిధులు వెచ్చించారు.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, Sakshi, రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖల నిధులతో మొత్తం 307 కిలోమీటర్ల కొత్త రహదారుల నిర్మాణం చేపట్టారు. ఇందులో ఇప్పటికే రూ. 100 కోట్ల విలువైన 611 రహదారుల నిర్మాణం పూర్తయ్యింది. వీటి పొడవు సుమారు 152 కిలోమీటర్లు. మరో 70కి పైగా రహదారి పనులు పురోగతిలో ఉన్నాయి. నిర్ణీత లక్ష్యాల్లో 80 శాతం కొత్త రహదారి నిర్మాణం పూర్తికావడంతో పిఠాపురం నియోజకవర్గంలోని పల్లెలు, పట్టణాల్లో రహదారి పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది.

స్థానిక శాసన సభ్యునిగా ప్రజలు కోరిన ప్రతి రహదారిని శ్రీ పవన్ కళ్యాణ్ మంజూరు చేసినట్లు స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి. పలు రహదారులు ప్రజల దైనందిన అవసరాలకు అనుగుణంగా, మరికొన్ని అన్నదాతల సౌలభ్యం కోసం, ఇంకొన్ని మత్స్యకారుల ప్రయాణ, రవాణా సౌకర్యాల కోసం నిర్మించారు.

ఉప్పాడ తీర ప్రాంతంలో జెట్టీకి వెళ్లే రహదారి బురదమయంగా ఉండడంతో మత్స్యకారులు వేటాడిన చేపల సరుకు రవాణాలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అక్కడ గ్రావెల్ రహదారి నిర్మించారు.

అలల కోతకు సముద్ర గర్భంలో కలిసిపోయిన ఉప్పాడ తీర ప్రాంతం మాయాపట్నం మత్స్యకారులకు 13 ఏళ్ల క్రితం సుబ్బంపేట సమీపంలో కొత్త మాయాపట్నం కాలనీ పేరిట పునరావాసం కల్పించినా, మౌలిక వసతులు అందించడంలో నిర్లక్ష్యం జరిగింది. ఈ కాలనీలో శ్రీ పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధతో రూ. 1.52 కోట్ల వ్యయంతో కాలనీ మధ్య 1.5 కిలోమీటర్ల సీసీ రహదారి, 2.8 కిలోమీటర్ల డ్రెయినేజీ నిర్మించారు. ఉప ముఖ్యమంత్రివర్యుల చొరవతో ఇప్పుడు కాలనీ మొత్తం కొత్త రహదారులతో వెలుగులు నింపుకుంది.

ఇదే ప్రాంతంలో ఉన్న మరో పునరావాస కాలనీ కొత్తసూరాడపేటలో 330 మంది నివసిస్తున్నారు. ఈ కాలనీకి రూ. 93 లక్షల వ్యయంతో 1.6 కిలోమీటర్ల సిమెంటు రహదారి నిర్మించి, సుబ్బంపేట–కొత్తపల్లి ప్రధాన రహదారికి అనుసంధానించారు.

యు.కొత్తపల్లి మండల పరిధిలోని అమరవిల్లి గ్రామం–రామన్నపాలెం బీచ్ రహదారి తుపాన్లు, భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతిని ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగించింది. ఉప ముఖ్యమంత్రివర్యుల చొరవతో రూ. 88 లక్షల వ్యయంతో ఈ రహదారి పునర్నిర్మాణం పూర్తిచేశారు. దీంతో సుమారు 2 వేల మందికి ప్రయాణ సౌకర్యం కలిగింది. బషీర్ బీబీ ఆలయ దర్శనానికి వెళ్లే భక్తులకు కూడా ఈ రహదారి ద్వారా సౌలభ్యం ఏర్పడింది.

అభివృద్ధికి దూరంగా ఉన్న SEZ పరిధిలోని ముమ్మడివారిపాడు గ్రామానికి రూ. 79.70 లక్షలతో శాశ్వత రహదారి సౌకర్యం కల్పించారు. SEZ పరిధి నుంచి విముక్తి కల్పించి గ్రామ అభివృద్ధికి దోహదం చేశారు.

కొత్తపల్లి గ్రామ ప్రజల చిరకాల వాంఛ అయిన శ్మశాన వాటికకు రహదారి సౌకర్యం కల్పించేందుకు రూ. 26.30 లక్షల వ్యయంతో 411 మీటర్ల సీసీ రహదారి నిర్మించారు. ఈ మార్గం ద్వారా సుమారు 4 వేల మంది ప్రత్యక్ష ప్రయోజనం పొందుతున్నారు.

యు.కొత్తపల్లి మండల పరిధిలోని కొండెవరం గ్రామ పంచాయతీకి అనుసంధానంగా ఉన్న పిఠాపురం–ఉప్పాడ R&B రహదారి ఏడు సంవత్సరాల క్రితం పూర్తిగా దెబ్బతింది. గత ప్రభుత్వం ఈ రహదారి పునర్నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేయడంతో సుమారు 8 వేల మంది పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రూ. 1.22 కోట్ల ఉపాధి నిధులతో 3.17 కిలోమీటర్ల రహదారి నిర్మాణాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించారు. ఈ రహదారి ద్వారా విద్యార్థులు, రైతులు, రోజువారీ వ్యాపారులు వంటి వందలాది మంది ప్రయాణ కష్టాలు తొలగించుకున్నారు.

సార్వత్రిక ఎన్నికల ముందు, తర్వాత శ్రీ పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చిన వినతుల్లో అధిక శాతం రహదారి సమస్యల పరిష్కారానికే సంబంధించినవని స్థానిక నాయకులు చెబుతున్నారు. ఉప ముఖ్యమంత్రివర్యుల ప్రత్యేక శ్రద్ధతో పిఠాపురం నియోజకవర్గంలో గుంతలు పోయి, కొత్త రహదారులు అభివృద్ధిని అక్కున చేర్చుకుంటున్నాయి.