రాయలసీమ న్యూస్, ఆంధ్రప్రదేశ్ డెస్క్:
గర్భిణులకు రూ.6,000 వరకు ఆర్థిక సాయం
: ‘ప్రధాన మంత్రి మాతృ వందన యోజన’ వివరాలు
గర్భధారణ సమయంలో మహిళలు ఆదాయం కోల్పోకుండా, తల్లి-బిడ్డ ఆరోగ్య పోషణకు భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి మాతృ వందన యోజన’ (PMMVY) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద అర్హులైన గర్భిణులు, పాలిచ్చే తల్లులకు రూ.5,000 నుంచి రూ.6,000 వరకు ఆర్థిక సాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది.
ఈ పథకం ద్వారా మొదటి కాన్పు, రెండో కాన్పు సందర్భాల్లో వేర్వేరు విధానాల ద్వారా సహాయం అందుతుంది. ముఖ్యంగా ఆడపిల్ల పుట్టినప్పుడు ప్రోత్సాహకంగా అధిక మొత్తాన్ని ఇవ్వడం ద్వారా బాలికల సంరక్షణ, పోషణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.
మొదటి కాన్పు సందర్భంలో, మొదటి బిడ్డకు మొత్తం రూ.5,000ను రెండు విడతలుగా మంజూరు చేస్తారు. గర్భం దాల్చిన వెంటనే ఆరోగ్య కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేయించుకుని, కనీసం ఒకసారి యాంటెనాటల్ చెకప్ చేయించుకున్న తర్వాత మొదటి విడతగా రూ.3,000 జమ అవుతుంది. అనంతరం బిడ్డ పుట్టినట్లు రిజిస్టర్ చేసి, 14 వారాల్లోపు ఇవ్వాల్సిన మొదటి దశ టీకాలు వేయించిన తర్వాత రెండో విడతగా రూ.2,000 అందుతుంది.
రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే ఒకే విడతలో రూ.6,000 నేరుగా తల్లి ఖాతాలో జమ చేస్తారు. ఆడబిడ్డల సంరక్షణ, పోషణను ప్రోత్సహించేందుకు ఈ అదనపు ఆర్థిక సాయం అందిస్తున్నారు.
ఈ పథకానికి 19 ఏళ్లు పైబడిన గర్భిణులు, పాలిచ్చే తల్లులు దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉండాలి లేదా దారిద్య్ర రేఖకు దిగువన ఉండాలి. MGNREGA జాబ్ కార్డ్, ఇ-శ్రమ్ కార్డ్ కలిగిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, ఇప్పటికే వేతనంతో కూడిన ప్రసూతి సెలవు ప్రయోజనాలు పొందుతున్నవారు ఈ పథకానికి అర్హులు కారు.
ఆర్థిక సాయం పొందేందుకు తల్లి ఆధార్ కార్డు, ఆధార్‌తో లింక్ అయిన బ్యాంకు లేదా పోస్టాఫీస్ ఖాతా పుస్తకం కాపీ, తల్లి-బిడ్డ సంరక్షణ కార్డు (MCP Card)తో పాటు మొబైల్ నంబర్ రిజిస్ట్రేషన్ అవసరం. రెండో విడత మొత్తానికి బిడ్డ జనన ధృవీకరణ పత్రం, టీకా కార్డు కూడా సమర్పించాలి. ప్రస్తుత నిబంధనల ప్రకారం భర్త ఆధార్ తప్పనిసరి కాదు.
దరఖాస్తు కోసం సమీప అంగన్వాడీ కేంద్రం లేదా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి, అక్కడి అంగన్వాడీ సిబ్బంది లేదా ASHA కార్యకర్తల వద్ద అప్లికేషన్ ఫారం తీసుకుని పూరించాలి. అవసరమైన పత్రాలను జతచేసి సమర్పించాలి. అలాగే ఆన్లైన్ ద్వారా కూడా అప్లై చేసే అవకాశం ఉంది.
దీనికి pmmvy.wcd.gov.in అనే అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి ‘Citizen Login’ ఎంపికను ఎంచుకోవాలి. మొబైల్ నంబర్ ద్వారా OTP పొందించి లాగిన్ అయ్యాక, వ్యక్తిగత వివరాలు నమోదు చేసి, అవసరమైన పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. బిడ్డ పుట్టిన 270 రోజులలోపు ఈ పథకానికి దరఖాస్తు చేయడం తప్పనిసరి అని అధికారులు సూచిస్తున్నారు.







