రాయలసీమ న్యూస్, ఆంధ్రప్రదేశ్ డెస్క్: పోలవరం జిల్లాలోని రంపచోడవరం మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఉరివేసుకుని మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇటీవల నిర్వహించిన మెగా Parent-Teacher Meetingలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో నేరుగా మాట్లాడిన అదే విద్యార్థిని ఇప్పుడు మృతదేహంగా మారడం ప్రాంత ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా వెలుగులోకి రాలేదు.
రంపచోడవరం మండలం ఇర్లపల్లి కొత్త కాలనీకి చెందిన ముర్రం శివాని స్థానిక ZPP ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. సోమవారం ఉదయం ఇంటి సమీపంలోని రేకుల షెడ్లో ఆమె ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనను అనుమానాస్పద మృతిగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను విచారిస్తూ శివాని ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ నెల 24న రంపచోడవరంలో నిర్వహించిన మెగా Parent-Teacher Meeting కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ కార్యక్రమంలో సీఎం పక్కనే కూర్చొని మాట్లాడిన విద్యార్థినే ముర్రం శివాని కావడం ఈ ఘటనకు మరింత విషాద ఛాయలు తీసుకొచ్చింది. కార్యక్రమంలో ముఖ్యమంత్రితో ఎంతో చక్కగా మాట్లాడిన శివాని రెండు రోజుల వ్యవధిలోనే మృతి చెందడం అందరికీ షాక్కు గురిచేసింది.
శివాని ఆత్మహత్య వార్త తెలిసిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ముఖ్యమంత్రితో మాట్లాడిన విద్యార్థిని ఇలా ప్రాణాలు తీసుకోవడం నమ్మశక్యం కావడం లేదని స్థానికులు చెబుతున్నారు. శివాని చదువులోనూ, ప్రవర్తనలోనూ సాధారణంగానే ఉండేదని పాఠశాల వర్గాలు పేర్కొంటున్నాయి.
శివాని మృతికి గల అసలు కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. కుటుంబ పరిస్థితులు, వ్యక్తిగత కారణాలు, పాఠశాల వాతావరణం తదితర అంశాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. పోస్టుమార్టం నివేదికతో పాటు దర్యాప్తు ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు పోలీసు వర్గాలు సూచిస్తున్నాయి.







