రాయలసీమ న్యూస్, ఆంధ్రప్రదేశ్ డెస్క్: ప్రకాశం జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వివిధ పేర్లతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని సోషలిస్ట్ యూత్ ఫెడరేషన్ (ఎస్వైఎఫ్) జిల్లా విద్యాశాఖను కోరింది. ఈ మేరకు ఎస్వైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖాధికారికి వినతిపత్రం సమర్పించారు.
జిల్లాలోని అనేక ప్రైవేట్ పాఠశాలలు సాధారణ పాఠశాల ఫీజులకు అదనంగా నీట్, ఐఐటీ, ఒలింపియాడ్, ప్రత్యేక కోచింగ్, వివిధ వెర్షన్ల పేరుతో అదనపు మొత్తాలు వసూలు చేస్తున్న నేపథ్యంలో, ఆ మొత్తాలకు సంబంధిత పాఠశాలలకు అనుమతి, నిబంధనల్లో చట్టబద్ధమైన ఆధారం ఉందా అనే అంశాలను పరిశీలించాలని వినతిపత్రంలో కోరారు.
ప్రతి పాఠశాల గుర్తింపు, అనుమతులు, ప్రకటించిన ఫీజులు, వాస్తవంగా వసూలు చేస్తున్న ఫీజులను రికార్డుల ఆధారంగా సమగ్రంగా తనిఖీ చేయాలని ఎస్వైఎఫ్ ప్రతినిధులు జిల్లా విద్యాశాఖాధికారికి వివరించారు. అధికారిక రసీదులు ఇవ్వకుండా అదనపు వసూళ్లు చేస్తున్నారా, నిర్దిష్ట దుకాణాల నుంచే పుస్తకాలు, యూనిఫాంలు కొనుగోలు చేయాలనే ఒత్తిడి తెస్తున్నారా వంటి అంశాలపై కూడా విచారణ జరపాలని వారు కోరారు.

ప్రైవేట్ పాఠశాలల ఫీజు నిర్మాణం, వసూళ్ల విధానంపై తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని, సంబంధిత పాఠశాలలపై అక్రమ వసూళ్లు, నిబంధనల ఉల్లంఘనల అంశాలను అధికారికంగా పరిశీలించాలని ఎస్వైఎఫ్ వినతిపత్రంలో పేర్కొంది.
విచారణలో నిబంధనల ఉల్లంఘనలు నిర్ధారణ అయితే బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని, అలాగే విచారణ వివరాలతో ఆక్షన్ టేకెన్ రిపోర్ట్ సిద్ధం చేసి అందించాలని ఎస్వైఎఫ్ జిల్లా విద్యాశాఖను అభ్యర్థించింది. ప్రైవేట్ పాఠశాలల ఫీజు వసూళ్లపై పారదర్శకత నెలకొనేలా, విద్యార్థులు, తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గేలా చర్యలు తీసుకోవాలని సంస్థ కోరింది.







