కూట‌మి పాల‌న‌లో మైనారిటీల‌కు ర‌క్ష‌ణ లేదు :

వైయ‌స్సార్‌సీపీ మైనారిటీ విభాగం విమ‌ర్శ

తాడేప‌ల్లి: పేద ముస్లింల ఆర్థిక ప‌రిస్థితిని ఆస‌రాగా చేసుకుని మోస‌పూరిత హామీలు ఇచ్చి ఓట్లు పొందిన అనంత‌రం, అధికారం లోకి వ‌చ్చాక ఒక్క‌టీ నెరవేర్చ‌కుండా మైనారిటీల‌కు వెన్నుపోటు పొడిచిన‌ట్లు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు పై వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయ‌కులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాడేప‌ల్లి లోని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మైనారిటీ విభాగం రాష్ట్ర స్థాయి స‌మావేశంలో వారు ఈ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో హామీలు ఇవ్వ‌డం, అధికారంలోకి వ‌చ్చాక వాటిని అమ‌లు చేయ‌క‌పోవ‌డం చంద్ర‌బాబు నాయుడుకు స‌ర్వ‌సాధార‌ణంగా మారింద‌ని మైనారిటీ విభాగం నాయ‌కులు విమ‌ర్శించారు. కూట‌మి పాల‌న కాలంలో మైనారిటీల‌కు ప్రోత్సాహం, గౌర‌వం మాత్ర‌మే కాకుండా క‌నీస ర‌క్ష‌ణ కూడా లభించ‌లేద‌ని వారు ఆరోపించారు.

దివంగ‌త వైయ‌స్సార్ త‌ర్వాత మైనారిటీల ప‌క్షాన బ‌లంగా నిల‌బ‌డి, వారిని రాజ‌కీయంగా ప్రోత్స‌హించిన ఘ‌న‌త మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికి ద‌క్కుతుంద‌ని మైనారిటీ నాయ‌కులు పేర్కొన్నారు. మైనారిటీల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి వైయ‌స్సార్‌సీపీ ప్ర‌భుత్వం కృషి చేసిందని వారు అభిప్రాయ‌ప‌డ్డారు.

ప్ర‌స్తుతం ఎస్ఐఆర్ పేరుతో జ‌రుగుతున్న ఓట‌ర్ లిస్టు స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ‌పై మైనారిటీ ఓట‌ర్లు అప్రమ‌త్తంగా ఉండాల‌ని స‌మావేశంలో సూచించారు. ఓట‌ర్ లిస్టులో త‌మ పేర్లు స‌రిగా ఉన్నాయా లేదా అన్న విష‌యంలో ప్ర‌తి ఒక్క‌రు జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించాల‌ని, ఏవైనా లోపాలు క‌నిపిస్తే వెంట‌నే సంభందిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాల‌ని నాయ‌కులు పిలుపునిచ్చారు. ప్ర‌తి ఓటు మైనారిటీల భ‌విష్య‌త్తును నిర్ణ‌యించేంత ప్రాముఖ్య‌మైన‌ద‌ని, అందువ‌ల్ల ఓటు హ‌క్కు వినియోగంలో నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శించ‌కూడ‌ద‌ని వారు సూచించారు.