తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ విజయవాడ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మొదటిసారి ఆంధ్రప్రదేశ్‌కి వస్తున్నారు. చెన్నై నుంచి బయల్దేరి విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం నేరుగా కనకదుర్గ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోనున్నట్లు సమాచారం.

సి జోసెఫ్ విజయ్ విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర చర్చ మొదలైంది. ఆయన క్రిస్టియన్ మతస్థుడు కావడంతో, దుర్గగుడిలోకి వెళ్లే ముందు డిక్లరేషన్ ఇవ్వాలా లేదా అన్న అంశంపై కొంతమంది నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. తిరుమలలో అమల్లో ఉన్న నిబంధనల మాదిరిగా విజయవాడ దుర్గగుడిలో కూడా అన్యమతస్తుల నుంచి డిక్లరేషన్ తీసుకుంటారా అనే సందేహం వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలో విజయవాడ కనకదుర్గ ఆలయ నిబంధనలపై స్పష్టత కోసం ఆలయ సమాచార కేంద్రాన్ని సంప్రదించారు. అమ్మవారి ఆలయంలో నాన్ హిందూ భక్తులు డిక్లరేషన్ ఇవ్వాలా అని అడిగినప్పుడు, అలాంటి నిబంధన ఏదీ లేదని సమాచార కేంద్ర ప్రతినిధి తెలిపారు. అయితే విదేశాల నుంచి వచ్చే భక్తుల విషయంలో మాత్రం డిక్లరేషన్ తీసుకునే విధానం ఉందని వారు వివరించారు. అందువల్ల తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ విజయవాడ దుర్గగుడిలో దర్శనం కోసం ప్రత్యేకంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదని స్పష్టమైంది.

డిక్లరేషన్ అంశం గతంలో కూడా పలు సందర్భాల్లో చర్చకు వచ్చింది. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల పర్యటనకు వెళ్లిన సమయంలో ఆయన నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని కొందరు రాజకీయ నాయకులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. 2024 సెప్టెంబర్‌లో జగన్ తిరుమల దర్శనానికి వెళ్లినప్పుడు టీటీడీ డిక్లరేషన్ నిబంధనపై చర్చ మరింత రేగింది.

తాజాగా 2024 అక్టోబర్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె పొలెనా అంజని కొణిదెల తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడు టీటీడీ నిబంధనల ప్రకారం ముందుగా డిక్లరేషన్ సమర్పించారు. అంజని మైనర్ కావడంతో ఆమె తరఫున తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా ఆ పత్రాలపై సంతకం చేశారు.

దేవాదాయశాఖ చట్టం 30/1987, టీటీడీ నిబంధనలలోని రూల్ 136, 137 ఆధారంగా 1990లో జారీ చేసిన జీవో ప్రకారం తిరుమల శ్రీవారి ఆలయంలో హిందువులు కాని వ్యక్తులు, ఇతర మతస్థులు స్వామివారిని దర్శించుకోవాలంటే అఫిడవిట్ రూపంలో డిక్లరేషన్ ఇవ్వాలి. తిరుమల వేంకటేశ్వర స్వామిపై పూర్తి నమ్మకం, భక్తి, గౌరవం ఉన్నదని ఆ ఫారమ్‌లో పేర్కొని సంతకం చేయాలి. పేరు, చిరునామా, మతం వంటి వివరాలు నమోదు చేసి, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద లేదా టీటీడీ అధికారులకు ఆ ఫారమ్ అందజేస్తే, పరిశీలన అనంతరం దర్శనానికి అనుమతి ఇస్తారు.

తిరుమలక్షేత్ర పవిత్రత, హిందూ సాంప్రదాయాల పరిరక్షణ కోసం ఈ నిబంధన అమల్లో ఉంది. గతంలో సోనియా గాంధీ, ఏపీజే అబ్దుల్ కలాం తదితర ప్రముఖులు కూడా డిక్లరేషన్ సమర్పించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే ఈ విధానం తిరుమలలో మాత్రమే అమల్లో ఉండగా, విజయవాడ కనకదుర్గ ఆలయంలో అన్యమతస్తుల నుంచి డిక్లరేషన్ తీసుకునే నిబంధన ప్రస్తుతం లేదు.