రాయలసీమ న్యూస్, అన్నమయ్య: మదనపల్లె, న్యూస్‌టుడే: విదేశాల నుంచి భారీగా డాలర్లు పంపిస్తామని నమ్మబలికి లక్షల రూపాయలు కాజేసిన సైబర్ నేరగాళ్ల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మోసగాళ్ల గుట్టురట్టు చేసినట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ తెలిపారు. మంగళవారం ఆయన కేసు వివరాలను వెల్లడించారు.
పోలీసుల సమాచారం ప్రకారం, మదనపల్లె మండలం పప్పిరెడ్డిపల్లెకు చెందిన వి. మోహన్‌కుమార్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఏప్రిల్ 4న ఎడ్విన్ పేరుతో ఓ వ్యక్తి ఆయనకు ఫోన్ చేసి, తాను దిల్లీకి వచ్చానని, 2.50 లక్షల అమెరికన్ డాలర్లను కస్టమ్ అధికారులు పట్టుకున్నారని చెప్పాడు. వాటిని విడిపించేందుకు క్లియరెన్స్ ఫీజు చెల్లిస్తే డాలర్లు అందజేస్తానని ఆశ చూపాడు.
ఆ మాటలు నమ్మిన మోహన్‌కుమార్ మొత్తం రూ.21,37,200ను నిందితులు సూచించిన బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. అనంతరం ఆ ఫోన్ నంబరు పనిచేయకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు మేరకు డీఎస్పీ పావని ఆధ్వర్యంలో గ్రామీణ సీఐ కళా వెంకటరమణ, ఎస్సై రామకృష్ణారెడ్డి, సైబర్ సెల్ సిబ్బంది దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలు, బ్యాంకు లావాదేవీలను పరిశీలించి అసోం రాష్ట్రానికి చెందిన సురజిత్ చేతియా, అహోట్లియన్ కైపెంగ్ ఈ మోసానికి పాల్పడ్డట్లు నిర్ధారించారు.
ఇద్దరూ తరచూ మదనపల్లె పరిసర ప్రాంతాలకు వచ్చి ఇలాంటి మోసాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారి కదలికలపై నిఘా పెట్టి ఇటీవల తట్టివారిపల్లె క్రాస్ వద్ద వారిని అరెస్టు చేశారు. విచారణలో నిందితులు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నట్లు బయటపడింది. అక్కడ నిర్వహించిన తనిఖీల్లో వారి నుంచి రూ.2 లక్షల నగదు, 3 చరవాణులు, 57 బ్యాంకు పాసు పుస్తకాలు, 35 ఏటీఎం కార్డులు, 49 చెక్ బుక్కులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు అమాయక ప్రజలకు కొంత డబ్బు ఇచ్చి వారి బ్యాంకు ఖాతాలను కొనుగోలు చేసి, వాటిని సైబర్ నేరాలకు వినియోగిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని ఎస్పీ తెలిపారు. ఈ మోసాల్లో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడిని త్వరలో అరెస్టు చేయడానికి చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
సైబర్ నేరాలకు గురైన వారు వెంటనే 1930 నంబరుకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని, ఎలాంటి ఆశాజనక ఆఫర్లకు లోనుకాకుండా జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ ప్రజలకు సూచించారు. నిందితులను పట్టుకున్న అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు.













