రాయలసీమ న్యూస్, అన్నమయ్య: ప్రయాణికుల భద్రత కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నిర్లక్ష్యంతో చిన్నపాటి ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ప్రమాదరహిత రవాణా కోసం ఆర్టీసీ సిబ్బందిని అధికారులు తరచూ హెచ్చరిస్తున్నా కొందరు వాటిని పట్టించుకోవడం లేదు.
చిత్తూరు జిల్లా పలమనేరు డిపోకు చెందిన ఓ డ్రైవర్ ఇటువంటి నిర్లక్ష్యానికి పాల్పడ్డాడు. పలమనేరు–మదనపల్లె మార్గంలో బస్సు నడుపుతూ సెల్‌ఫోన్ చూస్తూ ప్రయాణం కొనసాగించాడు. బస్సులో ఉన్న ఓ యువకుడు ఈ దృశ్యాన్ని తన చరవాణిలో చిత్రీకరించి ఉన్నతాధికారులకు పంపించాడు.
ఈ విషయం మంత్రి రాంప్రసాద్‌రెడ్డి దృష్టికి చేరడంతో ఆయన డ్రైవర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికుల భద్రత విషయంలో ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని స్పష్టం చేశారు. సంబంధిత డ్రైవర్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మంత్రివరి ఆదేశాల మేరకు పలమనేరు డిపో మేనేజర్ అల్తాఫ్ వెంటనే విచారణ చేపట్టారు. విచారణలో పలమనేరు డిపోకు చెందిన ఏపీ39 యువై 9691 హైర్ సర్వీసు బస్సు డ్రైవర్ కె. గణేష్‌కుమార్ సెల్‌ఫోన్ చూస్తూ బస్సు నడిపిన విషయం నిర్ధారితమైంది. దీనితో ఆయనను విధుల నుంచి అప్పటికప్పుడు తొలగిస్తూ డిపో యాజమాన్యం చర్యలు తీసుకుంది.
ప్రయాణికుల ప్రాణ భద్రతే ఆర్టీసీ సిబ్బంది ప్రధాన లక్ష్యంగా భావించాలని, అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలనే సూచనలు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇటువంటి నిర్లక్ష్యానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆర్టీసీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.













