రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్:
మహిళా క్రికెటర్ల కోసం ఐసీసీ కొత్త మార్గదర్శకాలు చారిత్రాత్మక ఘట్టం: దీపికా పదుకొణె
మహిళా క్రికెటర్ల కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా ప్రవేశపెట్టిన ‘పోస్ట్ ప్రెగ్నెన్సీ రిటర్న్ టు ప్లే’ మార్గదర్శకాలకు బాలీవుడ్ అగ్రనటి దీపికా పదుకొణె స్వాగతం పలికారు. క్రీడల్లో మహిళల కోసం తీసుకున్న అత్యంత అద్భుతమైన నిర్ణయమిదని, ఇది క్రికెట్లో చరిత్రాత్మక ఘట్టమని ఆమె అభిప్రాయపడ్డారు.
ప్రసవానంతరం మహిళా క్రికెటర్లు మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టే ప్రక్రియను సులభతరం చేయడమే లక్ష్యంగా ఐసీసీ ఈ కొత్త పాలసీని రూపొందించింది. దీని ప్రకారం ప్రసవం తర్వాత క్రికెటర్లకు అవసరమైన వైద్య, మానసిక సంరక్షణను అందించడంతో పాటు, ప్రతి ఆటగాడి అవసరాలకు అనుగుణంగా వ్యక్తిగత రికవరీ ప్లాన్లు సిద్ధం చేస్తారు. తిరిగి సంపూర్ణ ఫిట్నెస్ సాధించేలా ప్రత్యేక శిక్షణ షెడ్యూల్లు అమలు చేయనున్నారు.
పసిపిల్లలతో కలిసి ప్రయాణించే తల్లులైన క్రికెటర్ల కోసం కూడా ఐసీసీ ప్రత్యేక వసతులను కల్పించనుంది. అంతర్జాతీయ మ్యాచ్‌లు, టోర్నీల సమయంలో తల్లి, శిశువు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సౌకర్యాలను అమలు చేయాలని నిర్ణయించింది. మహిళా క్రీడాకారిణుల కెరీర్, కుటుంబ జీవితాల మధ్య సమతుల్యత సాధించేందుకు ఈ విధానాలు దోహదపడతాయని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.
ఐసీసీ ప్రకటించిన ఈ సరికొత్త పాలసీ వివరాలను దీపికా పదుకొణె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకున్నారు. మహిళా క్రికెటర్లకు లభించిన గొప్ప గుర్తింపుగా ఈ నిర్ణయాన్ని ఆమె అభివర్ణించారు. క్రీడల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే దిశగా ఇటువంటి చర్యలు మరింత వేగవంతం కావాలని సినీ, క్రీడా రంగాల్లో చర్చ నడుస్తోంది.
గతేడాది వర్కింగ్ అవర్స్ కారణంగా దీపికా పదుకొణె కొన్ని భారీ ప్రాజెక్టుల నుంచి వైదొలిగారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అనంతరం పలు ఇంటర్వ్యూల్లో బాలీవుడ్ అగ్రనటీనటులు మాట్లాడుతూ, తల్లి అయిన అనంతరం హీరోయిన్లకు కొన్ని వెసులుబాట్లు కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో కొత్తగా తల్లి అయిన మహిళా క్రికెటర్ల కోసం ఐసీసీ ప్రవేశపెట్టిన పాలసీపై, రెండోసారి తల్లి కానున్న దీపికా స్పందించడం చర్చనీయాంశంగా మారింది.
ఇక దీపికా పదుకొణె సినిమాల విషయానికి వస్తే, షారుక్ ఖాన్–సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘కింగ్’ చిత్రంలో ఆమె నటిస్తున్నారు. అలాగే అల్లు అర్జున్‌కు జోడీగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’లో కూడా దీపికా కీలక పాత్రలో కనిపించనున్నారు. సినీ రంగంలో బిజీ షెడ్యూల్ మధ్య మహిళా క్రీడాకారిణుల హక్కులు, సౌకర్యాలపై ఆమె చూపుతున్న ఆసక్తి ప్రస్తుతం బాలీవుడ్లో చర్చకు దారితీస్తోంది.







