డబ్బు ఎంత సంపాదిస్తున్నామన్నదికంటే, ఎంత ఆదా చేస్తున్నామన్నదే ఆర్థిక భద్రతకు కీలకం. పిల్లల చదువు, పెళ్లిళ్లు, రిటైర్‌మెంట్‌ వంటి భవిష్యత్‌ అవసరాల కోసం చాలా మంది ముందుగానే పొదుపు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఇందుకోసం బ్యాంకులు, పోస్టాఫీస్‌, స్టాక్‌ మార్కెట్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌ వంటి పలు పెట్టుబడి మార్గాలను ఎంచుకుంటున్నారు. అయితే మనం పెట్టే డబ్బు లక్ష్యానికి చేరాలంటే, అది ఎంతకాలంలో ఎంతగా పెరుగుతుందో అంచనా వేసుకోవడం అవసరం.

మన పొదుపు లక్ష రూపాయలు రెండు లక్షలు, మూడు లక్షలుగా మారడానికి ఎంత సమయం పడుతుందో సులభంగా లెక్కించేందుకు కొన్ని సాధారణ నియమాలు ఉన్నాయి. వాటిలో ఒకటి 114 రూల్‌. దీని ద్వారా మన పెట్టుబడి మూడింతలు కావడానికి పట్టే సుమారు కాలాన్ని అంచనా వేయొచ్చు. అలాగే డబ్బు రెట్టింపు కావడానికి 72 రూల్‌ కూడా ఉపయోగపడుతుంది. ఇవి రెండూ సాధారణ అంచనాల కోసం మాత్రమే ఉపయోగించే థంబ్‌ రూల్స్‌.

114 రూల్‌ – డబ్బు మూడింతలు కావడానికి పట్టే కాలం

డబ్బు మూడింతలు కావడానికి ఎంతకాలం పడుతుందో తెలుసుకోవాలంటే 114ను వార్షిక వడ్డీ రేటుతో భాగించాలి. వచ్చిన సంఖ్యే సుమారు సంవత్సరాల సంఖ్యగా పరిగణించవచ్చు.

ఉదాహరణకు, 6 శాతం వార్షిక వడ్డీ రేటుతో లక్ష రూపాయలను ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌గా పెట్టినట్లయితే 114ను 6తో భాగిస్తే 19 వస్తుంది. అంటే ఆ లక్ష రూపాయలు మూడింతలు కావడానికి దాదాపు 19 ఏళ్ల సమయం పడుతుంది. అదే వార్షిక వడ్డీ 8 శాతం ఉంటే 114/8 చేస్తే 14.25 వస్తుంది. అంటే సుమారు 14 ఏళ్లలో డబ్బు మూడింతలు అవుతుంది.

వడ్డీ రేటు 10 శాతం అయితే 114/10 ప్రకారం దాదాపు 11.4 ఏళ్లు, 12 శాతం వడ్డీ ఉంటే 114/12 ప్రకారం సుమారు 9.5 ఏళ్లలో పెట్టుబడి మూడింతలు కావొచ్చని ఈ రూల్‌ సూచిస్తుంది. ఇది పూర్తిగా వడ్డీ రేటు ఆధారంగా చేసే అంచనా మాత్రమే. అసలు లాభం మాత్రం పెట్టుబడి విధానం, పన్నులు, ఇతర ఛార్జీలు వంటి అంశాలపై కూడా ఆధారపడి ఉంటుంది.

72 రూల్‌ – డబ్బు రెట్టింపు కావడానికి పట్టే కాలం

114 రూల్‌లానే 72 రూల్‌ కూడా విస్తృతంగా ఉపయోగించే థంబ్‌ రూల్‌. డబ్బు రెట్టింపు కావడానికి పట్టే కాలాన్ని అంచనా వేయడానికి 72ను వార్షిక వడ్డీ రేటుతో భాగిస్తారు.

ఉదాహరణకు లక్ష రూపాయలపై వార్షిక వడ్డీ 6 శాతం ఉంటే 72/6 చేస్తే 12 వస్తుంది. అంటే ఆ లక్ష రూపాయలు రెట్టింపవడానికి దాదాపు 12 ఏళ్ల సమయం పడుతుంది. వడ్డీ రేటు 8 శాతం అయితే 9 ఏళ్లు, 10 శాతం అయితే 7.2 ఏళ్లు, 12 శాతం అయితే సుమారు 6 ఏళ్లలో పెట్టుబడి రెండింతలు కావొచ్చని ఈ రూల్‌ సూచిస్తుంది.

ఈ థంబ్‌ రూల్స్‌ ద్వారా పెట్టుబడిదారులు తమ పొదుపు ఎంతకాలంలో డబుల్‌, ట్రిపుల్‌ అవుతుందో ముందుగానే ఓ అంచనా వేసుకుని, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను ప్లాన్‌ చేసుకోవచ్చు. అయితే ఇవి కేవలం సులభ లెక్కల కోసం మాత్రమేనని, పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత పథకాల నిబంధనలు, ప్రమాదాలు, పన్ను ప్రభావం వంటి అంశాలను కూడా పరిశీలించడం అవసరం.