రిటైల్ పెట్రోల్ బంకుల్లో బల్క్ ఇంధన కొనుగోళ్లపై 90 రోజుల నిషేధం

న్యూఢిల్లీ: వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసం రిటైల్ పెట్రోల్ బంకుల్లో బల్క్‌గా ఇంధన కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించింది. పారిశ్రామిక, వాణిజ్య, ఇతర వ్యవస్థాగత వినియోగదారులు ఇకపై రిటైల్ పెట్రోల్ బంకుల్లో నుంచి పెట్రోల్, డీజిల్‌ను బల్క్‌గా కొనుగోలు చేయకూడదని స్పష్టం చేసింది.

ఈ మేరకు పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. అధీకృత బల్క్ సరఫరాదారుల ద్వారా మాత్రమే తమ అవసరాలకు అనుగుణంగా ఇంధనాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించింది. ఈ నిషేధం 90 రోజుల పాటు అమల్లో ఉంటుందని కేంద్రం పేర్కొంది.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఢిల్లీలోని రిటైల్ పెట్రోల్ బంకుల్లో లీటర్ డీజిల్ ధర రూ.95.20గా ఉండగా, బల్క్ సరఫరాదారుల వద్ద లీటరుకు రూ.134.50గా ఉంది. రిటైల్, బల్క్ డీజిల్ ధరల మధ్య ఈ భారీ వ్యత్యాసం కారణంగా కొందరు కమర్షియల్, పారిశ్రామిక వినియోగదారులు సాధారణ రిటైల్ పెట్రోల్ బంకులవైపు మళ్లుతున్నట్టు అధికారులు గుర్తించారు. రిటైల్ బంకుల్లో ఇంధనం తక్కువ ధరకు లభించడం వల్ల బల్క్ కొనుగోళ్లు పెరిగిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. రిటైల్, బల్క్ డీజిల్ ధరల్లో వ్యత్యాసం పెరుగుతుండటంతో మార్కెట్‌లో అసమతౌల్యం ఏర్పడే అవకాశం ఉన్నదని భావించిన ప్రభుత్వం, తాత్కాలికంగా ఈ పరిమితులు విధించింది.

ఇక సామాన్య వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా కేంద్రం ప్రత్యేక మార్గదర్శకాలు పంపింది. బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలు, అనుమతుల్లేని ప్రొక్యూర్మెంట్, ఇంధనాల దారి మళ్లింపు, ఇతర అక్రమాలకు తావు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. అందరి అవసరాలకు అనుగుణంగా ఇంధనం నిరంతరంగా అందుబాటులో ఉండేలా, సరఫరా వ్యవస్థలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్రం పేర్కొంది. రాబోయే రోజుల్లో పరిస్థితిని సమీక్షించి, అవసరమైతే తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు సూచిస్తున్నాయి.