రాయలసీమ న్యూస్, బిజినెస్ డెస్క్: ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తన ఫ్లైట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లో వినియోగదారుల అనుమతి ప్రక్రియను తప్పుదారి పట్టించే విధంగా డిజైన్ చేసినందుకు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) చర్యలు తీసుకుంది. డార్క్ ప్యాటర్న్స్‌గా పరిగణించే మోసపూరిత డిజైన్ పద్ధతులను ఉపయోగించినందుకు సంస్థపై రూ. లక్ష జరిమానా విధించింది.
విమాన టికెట్ బుకింగ్ సమయంలో వినియోగదారుల స్పష్టమైన సమ్మతి లేకుండానే వారిని స్పైస్ క్లబ్ లాయల్టీ ప్రోగ్రామ్‌లో చేర్చినట్లు సీసీపీఏ విచారణలో తేలింది. అలాగే ప్రమోషనల్ ఎస్సెమ్మెస్‌లు, వాట్సాప్ మెసేజ్‌లు, ఈ-మెయిళ్లు పంపేందుకు ముందుగానే అంగీకారం తీసుకున్నట్లు ప్లాట్‌ఫామ్‌లో చూపించినట్టు గుర్తించింది.
సంస్థ వెబ్‌సైట్‌లో ముందే టిక్ చేసిన చెక్‌బాక్స్‌లను ఉపయోగించడం ద్వారా వినియోగదారుల ఎంపికను ప్రభావితం చేసినట్లు సీసీపీఏ పేర్కొంది. వినియోగదారులకు నిజమైన ఎంపిక అవకాశం ఇవ్వకుండా, డిఫాల్ట్‌గా టిక్ ఉన్న బాక్స్‌ల ద్వారా సమ్మతి పొందినట్లు చూపించడం డార్క్ ప్యాటర్న్స్‌కు ఉదాహరణగా భావించింది.
ఈ నేపథ్యంలో స్పైస్‌జెట్‌కు నోటీసు జారీ చేసిన తర్వాత కూడా పాత చెక్‌బాక్స్‌ను తొలగించి మరో ప్రీ-టిక్ చెక్‌బాక్స్‌ను చేర్చడం ద్వారా అదే విధానాన్ని కొనసాగించినట్టు సీసీపీఏ తన ఉత్తర్వులో పేర్కొంది. నోటీసు అనంతరం కూడా డిజైన్‌లో మార్పులు చేసినప్పటికీ, వినియోగదారుల స్పష్టమైన సమ్మతిని పొందే విధంగా మార్పులు చేయలేదని నిర్ధారించింది.
సీసీపీఏ ఉత్తర్వులో స్పైస్‌జెట్ ప్లాట్‌ఫామ్‌లో బలవంతపు చర్య (forced action), ఇంటర్‌ఫేస్ ఇంటర్‌ఫెరెన్స్, మోసపూరిత ప్రశ్నలు అనే మూడు రకాల డార్క్ ప్యాటర్న్స్ ఉన్నట్లు గుర్తించింది. ముందే టిక్ చేసిన బాక్స్‌లు లేదా డిఫాల్ట్ సెట్టింగ్‌ల ద్వారా పొందిన అంగీకారం చట్టబద్ధమైన సమ్మతిగా పరిగణించలేమని స్పష్టం చేసింది.
ఈ విధానం వినియోగదారుల రక్షణ చట్టం-2019, ఈ-కామర్స్ నిబంధనలు-2020, అలాగే డార్క్ ప్యాటర్న్స్ మార్గదర్శకాలు-2023కు విరుద్ధమని సీసీపీఏ పేర్కొంది. వినియోగదారుల హక్కులను ఉల్లంఘించేలా ఉన్న ఈ డిజైన్ పద్ధతులు కొనసాగితే, మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని సూచించింది.
విచారణలో ఇది సాంకేతిక లోపం వల్ల జరిగిందని స్పైస్‌జెట్ వివరణ ఇచ్చినట్లు సీసీపీఏ ఉత్తర్వులో పేర్కొంది. అయితే అలాంటి లోపాలను పూర్తిగా సరిచేసి, అవి మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నట్లు హామీ ఇవ్వాలని సంస్థను ఆదేశించింది. వినియోగదారుల సమ్మతి ప్రక్రియను పారదర్శకంగా, స్పష్టంగా ఉండేలా ప్లాట్‌ఫామ్‌ను మార్చాలని సూచించింది.
డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో డార్క్ ప్యాటర్న్స్ వినియోగంపై సీసీపీఏ ఇటీవల ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ కేసు ద్వారా వినియోగదారుల అనుమతి లేకుండా లాయల్టీ ప్రోగ్రామ్‌లు, ప్రమోషనల్ సేవలకు చేర్చే పద్ధతులు అనుమతించబోమన్న సందేశాన్ని సంస్థలకు స్పష్టంగా ఇచ్చినట్టైంది.







