భారతీయ కుటుంబాల్లో, ముఖ్యంగా మధ్యతరగతి, పేద వర్గాల వారికి బంగారం ఒక పెద్ద ఆర్థిక భరోసాగా ఉంటుంది. అత్యవసర వైద్య ఖర్చులు, పిల్లల చదువులు, వ్యవసాయం, చిన్న వ్యాపార పెట్టుబడులు వంటి అవసరాల కోసం చాలామంది ఇంట్లో ఉన్న బంగారు నగలను తాకట్టు పెట్టి గోల్డ్ లోన్ తీసుకుంటారు. అవసరం తీరి డబ్బు వచ్చిన తర్వాత నగలను సులభంగా విడిపించుకోవచ్చనే నమ్మకంతో ఈ అడుగు వేస్తారు. అయితే అధిక వడ్డీ, వడ్డీపై వడ్డీ భారంతో అప్పు తీర్చలేకపోవడం వల్ల బంగారం వేలానికి వెళ్లే పరిస్థితులు ఎదురవుతున్నాయి.

బ్యాంకు లేదా ఫైనాన్స్ సంస్థ నుంచి “మీ బంగారం వేలానికి వస్తుంది” అనే నోటీసు వచ్చినప్పుడు చాలా మందికి తీవ్ర ఆందోళన కలుగుతుంది. ఎంతో కష్టపడి సంపాదించిన బంగారు నగలు వేలంలో పోతున్నాయనే ఆలోచన కుటుంబాలను మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందుల్లోకి నెడుతోంది. అయితే సరైన ప్రణాళిక, కొన్ని సులభమైన ఆర్థిక అలవాట్లతో గోల్డ్ లోన్ భారాన్ని తగ్గించుకోవడం, బంగారం వేలానికి వెళ్లకుండా కాపాడుకోవడం సాధ్యమేనని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

మొదటగా, గోల్డ్ లోన్ తీసుకునే సమయంలోనే సరైన సంస్థను ఎంచుకోవడం అత్యంత కీలకం. ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు సాధారణంగా నెలకు 2 శాతం నుంచి 4 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తాయి. అంటే ఏడాదికి 24 శాతం నుంచి 48 శాతం వరకు వడ్డీ పడుతుంది. సామాన్యుల నెల జీతంతో ఇంత భారీ వడ్డీని కట్టడం కష్టసాధ్యం. దీనికి బదులుగా మొదటి ఎంపికగా ప్రభుత్వ రంగ బ్యాంకులు అయిన స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా , ఇండియన్ బ్యాంకు వంటి సంస్థలు లేదా స్థానిక సహకార బ్యాంకులను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక్కడ వార్షిక వడ్డీ సుమారు 8 శాతం నుంచి 11 శాతం మధ్యలో ఉండడం వల్ల వడ్డీ భారం గణనీయంగా తగ్గుతుంది.

ఇంకో ముఖ్యమైన అంశం లోన్‌ చెల్లింపు విధానం. “ఒకేసారి పెద్ద మొత్తం వస్తే అప్పు మొత్తం కట్టి నగలు విడిపించుకుంటాం” అని ఎదురుచూడటం చాలా మందికి పెద్ద తప్పుగా మారుతోంది. కాలం గడుస్తున్న కొద్దీ వడ్డీ పెరిగిపోతుంది, చివరికి బ్యాంకు నగలను వేలం జాబితాలో చేర్చే పరిస్థితి వస్తుంది. బ్యాంకుల్లో లభించే పాక్షిక చెల్లింపు సౌకర్యాన్ని వినియోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చేతికి వచ్చినప్పుడల్లా 500, 1000, 2000 రూపాయలైనా గోల్డ్ లోన్ ఖాతాలో జమ చేస్తూ ఉంటే అసలు మొత్తం తగ్గి, తదనుగుణంగా వడ్డీ కూడా తగ్గుతుంది. ఇలా కొద్దికొద్దిగా చెల్లింపులు చేస్తూ ఉంటే వేలం నోటీసు వచ్చే అవకాశం తగ్గిపోతుంది.

రోజువారీ ఆదాయం ఉన్న కూలీలు, ఆటో డ్రైవర్లు, చిన్న వ్యాపారులు వంటి వర్గాలు రోజూ కొంత మొత్తాన్ని పక్కన పెట్టే అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. రోజుకు 50 లేదా 100 రూపాయలు పొదుపు చేస్తే నెలాఖరుకు మంచి మొత్తం సిద్ధమవుతుంది. ఆ మొత్తాన్ని నేరుగా గోల్డ్ లోన్‌కు చెల్లించడం ద్వారా అప్పు భారాన్ని తగ్గించుకోవచ్చు.

ఉద్యోగం కోల్పోవడం, ఆదాయం తగ్గిపోవడం వంటి కారణాలతో అసలు మొత్తాన్ని చెల్లించే స్థోమత లేకపోయినా, కనీసం వడ్డీ మొత్తాన్ని మాత్రం గడువులోపు చెల్లించడం ద్వారా గోల్డ్ లోన్‌ను పునరుద్ధరించుకునే అవకాశం ఉంటుంది. బ్యాంకు మేనేజర్‌ను నేరుగా కలిసి పరిస్థితిని వివరించి, వడ్డీ చెల్లింపుతో లోన్‌ రీన్యువల్‌ చేసుకోవడం ద్వారా బంగారం వేలానికి వెళ్లకుండా అదనపు సమయం పొందవచ్చు.

ఇక నగలు తాకట్టులో ఉన్న సమయంలో ఇంట్లో ఆడంబర ఖర్చులను తగ్గించడం కూడా అవసరం. కొత్త బట్టలు, అవసరం లేని గృహోపకరణాలు, పండగల పేరుతో చేసే అధిక ఖర్చులను నియంత్రించి, ఆ మొత్తాన్ని గోల్డ్ లోన్‌ చెల్లింపుకు మళ్లిస్తే నగలను త్వరగా విడిపించుకోవచ్చు. బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాకుండా, సామాన్యుల జీవితాల్లో ఒక ఆర్థిక భరోసా. ఆ భరోసాను వేలం పాటలో కోల్పోకుండా, సరైన ప్రణాళికతో గోల్డ్ లోన్‌ను నిర్వహించడం ప్రతి కుటుంబం బాధ్యతగా భావించాల్సిన అవసరం ఉంది.