దూసుకుపోతున్న భారత ఆర్థిక వ్యవస్థ:

జనవరి–మార్చి త్రైమాసికంలో 7.7 శాతం వృద్ధి

న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో అనిశ్చితులు, యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్నా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంలో దూసుకుపోతోంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే మెరుగైన వృద్ధి రేటును భారత్ నమోదు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాలు సూచిస్తున్నాయి.

మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్‌టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ శుక్రవారం ప్రకటించిన వివరాల ప్రకారం, 2026 జనవరి–మార్చి త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి 7.7 శాతం వృద్ధి రేటును సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన 7.1 శాతం వృద్ధితో పోలిస్తే ఈసారి ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా విస్తరించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2026తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సమగ్ర గణాంకాలను కూడా ఆ శాఖ విడుదల చేసింది. రియల్ జీడీపీ విలువ రూ.323.12 కోట్లకు చేరుకున్నట్టు పేర్కొంది. మరోవైపు, నామినల్ జీడీపీ 8.9 శాతం మేర పెరిగి రూ.346.36 కోట్లకు చేరినట్టు వెల్లడించింది.

ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ఈ వృద్ధి రేటు అంచనాలను పారిశ్రామిక ఉత్పత్తి, జీఎస్టీ వసూళ్లు, కార్పొరేట్ రంగం ఫలితాలు, వాహనాల విక్రయాలు, సరకు రవాణా, టెలికం వినియోగం, బ్యాంకింగ్ కార్యకలాపాలు, పన్నుల వసూళ్లు, వాణిజ్య డేటా వంటి పలు సూచీల ఆధారంగా రూపొందించారు. ఈ సూచీలన్నింటినీ సమగ్రంగా విశ్లేషించి తాజా అంచనాలను సిద్ధం చేసినట్టు అధికారులు తెలిపారు.

2022–23 ఆర్థిక సంవత్సరాన్ని ప్రామాణిక సంవత్సరంగా తీసుకుని రూపొందించిన కొత్త జీడీపీ గణాంకాల ఆధారంగా ఈ లెక్కలను ప్రభుత్వం సవరించింది. కొత్త బేస్ ఇయర్ ప్రకారం ఆర్థిక వ్యవస్థ పనితీరును అంచనా వేయడం వల్ల వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉన్న చిత్రం బయటపడుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్) జీడీపీ గణాంకాలను ఆగస్టు 31న విడుదల చేయనున్నట్టు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్‌టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ప్రకటించింది. ఆ గణాంకాలు వెలువడిన తర్వాత 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వృద్ధి దిశపై మరింత స్పష్టత రానున్నదని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి.