రష్యా నుంచి భారత్‌కు చమురు దిగుమతులు మే నెలలో మరింతగా పెరిగాయి. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్ఈఏ) తాజా నివేదిక ప్రకారం, మే నెలలో భారత్ రష్యా నుంచి సుమారు 5.8 బిలియన్ యూరోల విలువైన ఇంధనాలను దిగుమతి చేసుకుంది. దాంతో రష్యా ఇంధనాల ప్రపంచవ్యాప్తంగా రెండో అతిపెద్ద కొనుగోలుదారుగా భారత్ తన స్థానాన్ని కొనసాగించింది.

సీఆర్ఈఏ విశ్లేషణ ప్రకారం, భారత్ దిగుమతి చేసుకున్న రష్యా ఇంధనాల్లో ప్రధాన భాగం క్రూడ్ ఆయిల్‌దే. మొత్తం రష్యా ఇంధన దిగుమతుల్లో సుమారు 83 శాతం వాటా క్రూడ్ ఆయిల్‌కే చెందింది. ఈ క్రూడ్ ఆయిల్ దిగుమతుల విలువ 4.8 బిలియన్ యూరోలుగా నమోదైంది.

క్రూడ్ ఆయిల్‌తో పాటు రష్యా నుంచి చమురు ఉత్పత్తుల దిగుమతులు కూడా కొనసాగుతున్నాయి. మే నెలలో చమురు ఉత్పత్తుల దిగుమతుల విలువ 550 మిలియన్ యూరోలుగా సీఆర్ఈఏ నివేదికలో పేర్కొంది. అదేవిధంగా బొగ్గు దిగుమతులు 429 మిలియన్ యూరోల స్థాయిలో నమోదయ్యాయి.

మే నెలలో భారత్ మొత్తం క్రూడ్ ఆయిల్ దిగుమతులు నెలవారీ ప్రాతిపదికన 8 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. ఇందులో రష్యా నుంచి వచ్చిన చమురు దిగుమతుల పెరుగుదల కీలక పాత్ర పోషించింది. రష్యా నుంచి భారత్‌కు వచ్చిన క్రూడ్ ఆయిల్ దిగుమతులు ఒక్క మే నెలలోనే 21 శాతం పెరిగినట్లు సీఆర్ఈఏ పేర్కొంది.

ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాపై విధించిన ఆంక్షల నేపథ్యంలో రష్యా చమురుకు ఆసియా మార్కెట్లలో డిమాండ్ పెరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్, చైనా వంటి దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను గత కొంతకాలంగా గణనీయంగా పెంచుతున్నాయి. తాజా గణాంకాలు కూడా అదే ధోరణిని ప్రతిబింబిస్తున్నాయని సీఆర్ఈఏ విశ్లేషణ సూచిస్తోంది.

రష్యా నుంచి తక్కువ ధరలకు లభిస్తున్న క్రూడ్ ఆయిల్‌ను భారత్‌లోని రిఫైనరీలు అధికంగా కొనుగోలు చేస్తున్నాయని, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ కొనుగోళ్లు కొనసాగుతున్నాయని నివేదికలో విశ్లేషకులు పేర్కొన్నారు. రాబోయే నెలల్లో కూడా ఈ ధోరణి ఎలా మారుతుందన్న దానిపై పరిశ్రమ వర్గాలు, విధాన నిర్ణేతలు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.